Mamata Fire on PM Modi: సమావేశానికి పిలిచి, అవమానించారు.. ప్రధాని మోదీ తీరుపై బెంగాల్ సీఎం మమతా ఫైర్

కోవిడ్-19 పరిస్థితిపై గురువారం జరిగిన సమావేశంలో ఇతరులు మాట్లాడేందుకు ప్రధాని మోదీ అవకాశం ఇవ్వలేదని, తన గౌరవానికి భంగం జరిగిందని, తాను అవమానానికి గురయ్యానని ఆరోపించారు.

Mamata Fire on PM Modi: సమావేశానికి పిలిచి, అవమానించారు.. ప్రధాని మోదీ తీరుపై బెంగాల్ సీఎం మమతా ఫైర్
Bengal Cm Mamata Banerjee
Follow us
Balaraju Goud

|

Updated on: May 20, 2021 | 4:13 PM

Mamata Fire on PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మరోసారి ఫైరయ్యారు. కోవిడ్-19 పరిస్థితిపై గురువారం జరిగిన సమావేశంలో ఇతరులు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, తన గౌరవానికి భంగం జరిగిందని, తాను అవమానానికి గురయ్యానని ఆరోపించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని సమావేశానికి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో పాటు అయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా హాజరయ్యారు. అయితే, వారితో మోదీ మాట్లాడలేదని బెంగాల్ దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ముఖ్యమంత్రులను పిలిచిన తర్వాత ఆయన మాతో మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. మమ్మల్ని మాట్లాడనివ్వలేదు’’ అని మమత మండిపడ్డారు. కేవలం కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మోదీ మాత్రమే కాసేపు ప్రసంగించారని, ఆ తర్వాత సమావేశాన్ని ముగించేశారని ఆమె చెప్పారు. ఇది సాధారణ సమావేశమన్నారు.

మేం అవమానానికి గురయ్యామనే భావిస్తున్నాం. వ్యాక్సిన్ల గురించి కానీ, రెమ్‌డెసివిర్ గురించి అడిగేందుకు అవకాశం ఇవ్వలేదని ఆమె ధ్వజమెత్తారు. అలాగే, దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించి అడగలేదన్నారు. బెంగాల్‌లో వ్యాక్సిన్ల కొరత ఉందనే విషయాన్ని లేవనెత్తాలనుకున్నానని, ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా మరిన్ని వ్యాక్సిన్ డోసులను సరఫరా చేయాలని కోరాలని అనుకున్నానని తెలిపారు. కానీ తమకు మాట్లాడేందుకు అవకాశమివ్వలేదన్నారు.

కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయని మోదీ ఈ సమావేశంలో చెప్పారన్నారు. ఆయన గతంలో కూడా ఇదేవిధంగా చెప్పారని గుర్తు చేశారు. ఆయన మాటలతో కేసులు మరింత పెరిగాయన్నారు. ‘‘మోదీ ఎంత అభద్రతాభావంలో ఉన్నారంటే, ఆయన మా మాట కనీసం వినలేదు’’ మమతా ఆరోపించారు.

ఇదిలావుంటే, బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎదురుదాడికి దిగారు. ఇంతకు ముందు నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీతో సమావేశాన్ని బెంగాల్ మమతా బెనర్జీ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఆయన దీదీపై విరుచుకుపడ్డారు.

వరుస ట్వీట్లలో సువేందు అధికారి.. “ఇవాళ ప్రధని మోదీతో జరిగిన సమావేశంలో సీఎం మమతా బెనర్జీ మరోసారి పరిపాలన పట్ల తనకున్న అనాసక్తి కనిపించిందన్నారు. ఆమె శైలికి అనుగుణంగా, ప్రధాని మోదీ జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశాన్ని రాజకీయం చేశారు. ఇక్కడ కోవిడ్ -19 తో పోరాడటానికి క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలపై మాత్రమే చర్చించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని నెలలుగా ముఖ్యమంత్రులతో అనేక సమావేశాలు జరిపారు. మమతా బెనర్జీ ఒక్కసారిగా కూడా హాజరుకాలేదన్నారు సువేందు అధికారి. సీఎం మమతా.. తనను అవమానించానని చెప్పడం సరికాదన్నారు.

Read Also…  తమిళనాట సరికొత్త రాజకీయాలు, అందరి మన్ననలు అందుకుంటున్న సీఎం స్టాలిన్‌