భయాందోళనలు రేకెత్తిస్తున్న కొత్త వ్యాధి వైట్ ఫంగస్
ప్రపంచానికి పాడుకాలం దాపురించింది.. మానవాళిని మట్టుపెట్టడానికా అన్నట్టుగా వ్యాధులు ఒకదాని వెంట మరోటి తరుముకొస్తున్నాయి. భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి..
ప్రపంచానికి పాడుకాలం దాపురించింది.. మానవాళిని మట్టుపెట్టడానికా అన్నట్టుగా వ్యాధులు ఒకదాని వెంట మరోటి తరుముకొస్తున్నాయి. భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.. కరోనా వైరస్ నుంచి గట్టెక్కడానికి శతవిధాల ప్రయత్నిస్తున్న మనకు బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త వ్యాధి ఎదురయ్యింది. కరోనా నుంచి కోలుకుని కాసింత స్థిమితపడేలోపు బ్లాక్ ఫంగస్ మింగేస్తోంది.. చాప కింద నీరులా బ్లాక్ ఫంగస్ విస్తరిస్తోంది. ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఆ భయంకరమైన వ్యాధిని అరికట్టడానికి ప్రభుత్వాలు నడం బిగించాయి.. గట్టి చర్యలు తీసుకుంటున్నాయి.
బ్లాక్ ఫంగస్‌పై ప్రభుత్వాలు, వైద్య అధికారులు సీరియస్‌గా దృష్టి పెట్టిన ఈ సమయంలోనే వైట్ ఫంగస్ అనే వ్యాధి వెలుగులోకి వచ్చింది. అంతటా వైట్ ఫంగస్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధితో చాలా మంది కన్నుమూస్తున్నారు. బీహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌లాగే వైట్ ఫంగస్ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే మాత్రం ప్రాణాలు పోతాయి.
ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించి ప్రాణాలు తీస్తుందట వైట్ ఫంగస్.
ఇది బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమట! అసలు వైట్ ఫంగస్ అన్నది ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. కరోనా లక్షణాలతో ఉన్న ఓ నలుగురు వ్యక్తులకు కరోనా పరీక్షలు చేశారు.. టెస్ట్‌ల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ కరోనా లక్షణాలు మాత్రం అధికంగా ఉన్నాయి.. ఇలాగైతే లాభం లేదనుకుని హెచ్‌ఆర్‌సీటీ పరీక్షలు చేశారు. అప్పుడు కూడా నెగటివే వచ్చింది. ఇదేమిటీ ఇలా జరుగుతుందని అనుకున్న డాక్టర్లు ఎందుకైనా మంచిదని మ్యూకస్ కల్చర్‌ను పరీక్షించారు. అప్పుడు వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్ ఉన్నట్లు ఉన్నట్లు తేలడంతో వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు. ఇప్పుడు వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. కొన్ని గంటలు ఆలస్యమైతే మాత్రం ప్రాణాలు పోయేవని చెప్పారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధి కరోనా నుంచి కోలుకున్నవారికి వస్తుంది. వైట్ ఫంగస్ అలా కాదు.. కరోనా లక్షణాలు ఉన్నవారిలోనూ బయటపడుతుంది.
కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలో నెగటివ్ వస్తే రిలాక్సవ్వడానికి వీలులేదని, వెంటనే మ్యూకస్ కల్చర్ పరీక్ష జరిపించుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ ఫంగస్‌లాగే వైట్ ఫంగస్ కూడా .. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఈజీగా అటాక్ చేస్తుంది. మధుమేమం ఉన్నవారికి, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్నవారికీ ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ రైల్వే స్టేషన్ కు అసలు పేరే లేదు.. ఎందుకో, ఎక్కడో తెలుసా..?? ( వీడియో )