ఉత్తమ్ వర్సెస్ రేవంత్.. టీ కాంగ్రెస్‌లో కొత్త ‘రచ్చ’
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుండగా.. మరోవైపు నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తన సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ […]
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటికే ఆ పార్టీ బలం రోజురోజుకు తగ్గిపోతుండగా.. మరోవైపు నేతల మధ్య అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తన సతీమణి, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి పేరును ప్రకటించడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాతో బుధవారం భేటీ అయి ఫిర్యాదు చేశారు.
ఉత్తమ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. హుజుర్ నగర్ టికెట్ అంశంపై ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని రేవంత్ రెడ్డి కుంతియాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయంలో ఉత్తమ్‌కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కుంతియాను కోరినట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై సానుకూలంగా స్పందించిన కుంతియా.. కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళతానని రేవంత్‌కు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
అయితే తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసిన ఆయన అందులో గెలుపొంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ స్థానానికి జరిగే ఉపఎన్నికకు తన భార్య పద్మావతిని బరిలో నిలుపుతున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. దీనికి సంబంధించి స్థానిక నేతలతో ప్రచారం కూడా చేయిస్తున్నారు. దీనిని రేవంత్ వర్గం వ్యతిరేకిస్తోంది. అక్కడి నుంచి శ్యామలా కిరణ్ రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తోంది. స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్‌పై కుంతియాకు ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి.