సొంతిళ్లు లేని వారికి రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్.. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ముహూర్తం ఫిక్స్..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంతిళ్లు లేని నిరుపేదల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన చేశారు. సొంతిళ్లు లేని నిరుపేదల కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను వెల్లడించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇప్పటికే మొదటి విడతను విజయవంతంగా పూర్తి చేస్తోందని, దీనికి సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నట్లు తెలిపారు.
నియోజకవర్గమే యూనిట్‌గా స్థలాల గుర్తింపు
పేదలకు ఇచ్చే ఇళ్లు వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం 5-8 కిలోమీటర్ల పరిధిలో నివాస స్థలాలు గుర్తించాలని నిర్ణయం. లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి లేదా నియోజకవర్గానికి గరిష్టంగా 5 నుంచి 8 కి.మీ. పరిధిలోనే ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం నగరానికి 20-30 కి.మీ. దూరంలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. ఆ తప్పు పునరావృతం కాకుండా మురికివాడలు, ప్రభుత్వ భూములు, భూదాన్ భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
2BHK ఇళ్ల కేటాయింపుపై స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్‌లో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మే నెలాఖరు నాటికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇళ్లను కేటాయించాలి. ఇందిరమ్మ కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోవాలనుకునే అర్హులకు ఈ నెలాఖరులోగా మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆక్రమణలపై ఉక్కుపాదం
ప్రభుత్వ భూమి అంగుళం కూడా అన్యాక్రాంతమైతే సహించేది లేదని మంత్రి పొంగులేటి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా భూముల రిజిస్ట్రేషన్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, మల్కాజిగిరి ఘటనను ఉదాహరణగా చూపుతూ సబ్ రిజిస్ట్రార్‌పై చర్యలకు ఆదేశించారు. రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దు వివాదాలను పరిష్కరించి, ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సమీక్షలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొని, పేదరికమే ప్రాతిపదికగా, ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
