Andhra: మాటిచ్చారు.. ఫ్లైట్‌లో తీసుకెళ్లారు.. మీరు గ్రేట్ మాస్టర్..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు తెలుగు ఉపాధ్యాయుడు సత్యారావు వినూత్న కార్యక్రమం చేపట్టారు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్లైట్ జర్నీ చేయిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఆరుగురు విద్యార్థులకు విశాఖ నుంచి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో పెద్ద లక్ష్యాలపై నమ్మకం పెంచిందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, లక్ష్యసాధనపై నమ్మకం, పోటీతత్వ భావన పెంపొందించేందుకు గోపన్నవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఫ్లైట్ జర్నీ చేయిస్తానని హామీ ఇచ్చారు. అలా టీచర్ సత్యారావు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయించారు.
విశాఖపట్నం నుంచి విజయవాడకు ఇండిగో విమానంలో విద్యార్థులను తీసుకెళ్లిన సత్యారావు, వారికి తొలి విమానయాన అనుభూతిని అందించారు. అనంతరం విజయవాడ చేరుకొని అక్కడ కనకదుర్గ టెంపుల్ లో దర్శనం చేయించారు. అంతేకాకుండా భవానీ ఐల్యాండ్ తో పాటు నగరంలోని ముఖ్య ప్రదేశాలను చూపించారు. అనంతరం రైలు ప్రయాణంలో విజయనగరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా పెద్ద లక్ష్యాలు సాధించగలమనే ఆత్మవిశ్వాసం కల్పించడం తన ఉద్దేశమని సత్యారావు అన్నారు.
వీడియో చూడండి..
గత ఏడాది కూడా ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు విమాన ప్రయాణం చేయించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారిని కలిసి ఈ కార్యక్రమం వివరాలను తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఈ టీచర్ ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
