Kavya Maran : అందరూ రూల్స్ పాటిస్తుంటే.. కావ్య మేడమ్ మాత్రం సైలెంట్‌గా గేమ్ మార్చేసిందిగా
Kavya Maran : ద హండ్రెడ్ లీగ్‌లో పాకిస్థాన్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ రూ.2.45 కోట్లకు కొనుగోలు చేయడంపై ఫ్రాంచైజీ అధినేత్రి కావ్య మారన్ స్పందిస్తూ, జట్టు కూర్పుపై తాను సంతృప్తిని వ్యక్తం చేశారు. 2008 ఐపీఎల్ మొదటి సీజన్ తర్వాత ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా పాకిస్థాన్ ఆటగాళ్లను తమ ప్రాతినిధ్య జట్లలోకి తీసుకోలేదు.

Kavya Maran : క్రికెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తున్న ద హండ్రెడ్ 2026 లీగ్ జూలై 21 నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు సాగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలు కూడా ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టడం విశేషం. ముంబై ఇండియన్స్ ఎంఐ లండన్ పేరిట, ఐపిఎల్ జెఎస్‌డబ్ల్యూ-జిఎమ్‌ఆర్ (ఢిల్లీ క్యాపిటల్స్) సౌతర్న్ బ్రేవ్, లక్నో సూపర్‌జెయింట్స్ మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్ లీడ్స్ రూపంలో ఈ ఇంగ్లాండ్ లీగ్‌లో భాగస్వామ్యాలు దక్కించుకున్నాయి.
సన్‌రైజర్స్ కావ్య మారన్ సంచలన నిర్ణయం
2008 ఐపీఎల్ మొదటి సీజన్ తర్వాత ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా పాకిస్థాన్ ఆటగాళ్లను తమ ప్రాతినిధ్య జట్లలోకి తీసుకోలేదు. కానీ ద హండ్రెడ్ వేలంలో సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ ఈ విధానానికి భిన్నంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మార్చిలో జరిగిన వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను ఏకంగా 1,90,000 పౌండ్లకు (సుమారు రూ.2.45 కోట్లు) కొనుగోలు చేశారు. లీగ్ మొదటి మ్యాచ్‌లోనే అబ్రార్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ తుది జట్టులోకి తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.
ప్రశ్నకు స్పందించిన కావ్య మారన్
ఇంగ్లాండ్‌కు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రికతో మాట్లాడిన సందర్భంగా.. పాకిస్థానీ క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడంపై కావ్య మారన్‌కు ప్రశ్న ఎదురైంది. అయితే ఆమె ప్రత్యక్ష వివాదాలకు దూరంగా ఉంటూ ఎంతో చాకచక్యంగా సమాధానమిచ్చారు. “మేము పురుషులు, మహిళల రెండు జట్ల కూర్పు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం. జట్టు ఎంపికలో ఎన్నో విషయాలను దృష్టిలో ఉంచుకొని సరైన బ్యాలెన్సును సాధించాం” అని స్పష్టం చేశారు.
ద హండ్రెడ్ లీగ్‌లో మరో పాక్ ప్లేయర్
ఈ సీజన్ ద హండ్రెడ్ టోర్నీలో కేవలం ఇద్దరు పాకిస్థాన్ క్రికెటర్లకు మాత్రమే అవకాశం లభించింది. సన్‌రైజర్స్ లీడ్స్ తరఫున అబ్రార్ అహ్మద్ ఆడుతుండగా, మరో పాక్ ప్లేయర్ ఉస్మాన్ తారిక్‌ను బర్మింగ్‌హామ్ ఫినిక్స్ ఫ్రాంచైజీ 1,40,000 పౌండ్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ యాజమాన్యాల ప్రవేశంతో ఈసారి ద హండ్రెడ్ లీగ్ ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
