హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ మారుతున్న నాయకులు ఎక్కువౌతున్నారు. జంపింగ్‌లు ఊపందుకున్నాయి. ఆశించిన టిక్కెట్ రావడంలేదనో లేక మరింత మంచి స్థానం ఆశించో కొందరు నాయకులు పార్టీలను ఫిరాయిస్తున్నారు. ఈ పరిస్థితి ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. మేడా మల్లికార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్‌లు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అయితే ఇదే తరహా తీరు తెలంగాణలో కూడా మొదలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి ఖమ్మం లోక్‌సభ సీటును ఆశిస్తున్నారు. ఈ మేరకు అధిష్టానానికి తెలియజేస్తూ తన వాదనను గట్టిగా వినిపించినట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ ఆ సీటు కేటాయించకపోతే కాంగ్రెస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. గత కొంత కాలం నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంటున్నారు.