జహిరాబాద్ నుంచి వరుసగా రెండుసార్లు టీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్‌కు… ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తొలిసారి మంచి మెజార్టీతోనే గెలిచినా… రెండోసారి మాత్రం చావు తప్పి కన్ను లోట్టబోయినట్టు 5వేల మెజార్టీతో బయటపడ్డారు. అప్పట్నుంచే ఆయనకు కష్టకాలం మొదలైనట్టు చెప్పుకోవాలి. 2014 ఎన్నికల నాటికి అసలు పార్టీలో సభ్యత్వమే లేకున్నా.. బీబీ పాటిల్‌కు టీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కింది. అదే ఊపులో 2019లోనూ టిక్కెట్ దక్కించుకున్న ఆయన.. గెలుపును మాత్రం అంత ఈజీగా దక్కించుకోలేకపోయారు. ఆ తర్వాత తన సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో.. పూడ్చుకోలేనంత గ్యాప్ పెంచేసుకున్నారు పాటిల్. దీంతో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలంటేనే వెనకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికి, కారణం ఎంపీ పాటిల్ నడవడికేనన్న ప్రచారం జరుగుతోంది.
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాలు.. జహిరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పుడా సెగ్మెంట్లలో ఎంపీ పర్యటించడానికి.. స్థానిక ఎమ్మెల్యేలు ససేమిరా అంటున్నారు. దీనికి బీబీపాటిల్ అనుసరిస్తున్న పద్ధతులేనన్న వాదన వినిపిస్తోంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో సమాంతరంగా తన గ్రూప్ లను ఏర్పాటు చేసుకోవడంతో పేచీ మొదలైంది. ఏరికోరి తీసుకొచ్చి ఎంపీగా గెలిపిస్తే.. తమకే ఎసరు పెడుతున్నాడంటూ ఫైరవుతున్నారంట ఎమ్మెల్యేలు.
ఎమ్మెల్యేలు, ఎంపీ పాటిల్‌ని లెక్కచేయడం లేదా?
బాబూ.. నీకో దండం.. మా నియోజకవర్గాలు రావొద్దు… అని ముఖం మీదే ఎంపీ బీబీ పాటిల్‌కు చెప్పేశారంట జహిరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు. తమ నియోజకవర్గాల్లో ఎలాంటి అబివృద్ది పనులు జరిగినా.. అసలు ఎంపీని ఆహ్వానించడమే మానేశారట ఎమ్మెల్యేలు. రెండోసారి ఎన్నికయ్యాక.. ఎంపీ బీబీ పాటిల్.. అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటించింది చాలా తక్కువ. దీంతో, ఎమ్మెల్యేలు అసలు ఎంపీని లెక్కచేయడమే మానేశారన్న ప్రచారమూ జరుగుతోంది. గతంలో ఎంపీకి, ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత ఉన్నా .. అది పూర్తిగా చెడింది. ప్రొటోకాల్ ప్రకారం పిలవాల్సిన కార్యక్రమాలకూ.. ఎంపీని ఆహ్వానించడం లేదు ఎమ్మెల్యేలు.
ఎంపీ పాటిల్‌పై అధినేతకు ఎమ్మెల్యేల ఫిర్యాదు!
ముందస్తు ఎన్నికల సమయంలో… ఎంపీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అప్పట్నుంచే ఎంపీకి, ఎమ్మెల్యేలకూ మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. నియోజకవర్గాల్లో ఎంపీ తయారు చేసుకున్న సమాంతర గ్రూపుల వివరాల్ని కూడా అధినేత దృస్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యేలు. అంతేకాదు, ఎప్పుడు పోన్ చేసినా.. పీఎ గారు తప్ప ఎంపీ అందుబాటులోకి రాకపోవడం ఎమ్మెల్యేల్లో, ముఖ్యనేతల్లో ఆగ్రహం తెప్పించిందట. ఈ వ్యవహారంలో అధిష్టానం కలుగజేసుకోకుంటే.. పార్టీకి నష్టం తప్పదన్న అభిప్రాయం గులాబీ క్యాడర్‌లో వ్యక్తమవుతోంది. మరి, ఈ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేస్ ఎపిసోడ్.. ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.