AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు.. ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది.. పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక

దేశంలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిసి ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి..

లోక్‌సభకు, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు.. ప్రభుత్వ, పార్టీల వ్యయం తగ్గుతుంది.. పార్లమెంటరీ ప్యానెల్‌ నివేదిక
K Sammaiah
|

Updated on: Mar 17, 2021 | 12:24 PM

Share

దేశంలో లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిసి ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ నుంచి ఈ డిమాండ్‌ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సైతం జమిలి ఎన్నికల అంశాన్ని వదిలిపెట్టకుండా వీలున్నప్పుడల్లా అనేక వేదికల మీదా ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా, ఈ ప్రతిపాదనకు పార్లమెంటరీ స్థాయీసంఘం మద్దతు కూడా లభించింది.

జమిలి ఎన్నికల వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుందని, రాజకీయ పార్టీల వ్యయం కూడా దిగివస్తుందని , కాబట్టి, వాటిని నిర్వహించటం మంచిదేనని పేర్కొంటూ నివేదికను సమర్పించింది. కేంద్ర సిబ్బంది, న్యాయశాఖలకు సంబంధించి ఏర్పాటైన స్థాయీసంఘం ఈ నివేదికను రూపొందించింది. దీనిని పార్లమెంట్‌ ఉభయసభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జమిలి ఎన్నికల వల్ల మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునేందుకు వీలవుతుందని నివేదికలో స్థాయీసంఘం పేర్కొన్నది.

దేశంలో తరచూ జరిగే ఎన్నికలతో ప్రజల్లో ఏర్పడిన అనాసక్తిని జమిలి ఎన్నికలతో తగ్గించవచ్చని, తద్వారా ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కూడా పెరుగుతుందని అభిప్రాయపడింది. దేశంలో జమిలి ఎన్నికలు కొత్తకాదని, తొలి మూడు సార్వత్రిక ఎన్నికలు (1952, 57, 62) జమిలి పద్ధతిలోనే జరిగాయని నివేదిక గుర్తుచేసింది. రాజ్యాంగానికి సవరణలు చేయడం ద్వారా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపింది.

అయితే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా లోక్‌సభ, ఆయా రాష్ట్రాల శాసనసభల గడువులను ఒకదానికొకటి సర్దుబాటు చేయాల్సి ఉన్నదని పేర్కొన్నది. ఇందుకు పలు రాష్ట్రాల చట్టసభల గడువును పొడిగించడం లేదా తగ్గించడం చేయాల్సి ఉంటుందని, దీనికి రాజకీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరమున్నదని తెలిపింది.నిత్యం ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై భారం పడుతున్నదని, అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నదని పేర్కొన్నది. 1983లో ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. అనంతరం జస్టిస్‌ జీవన్‌రెడ్డి నేతృత్వంలోని లా కమిషన్‌ కూడా ఏకకాల ఎన్నికలకు మద్దతు తెలిపిందని గుర్తుచేసింది.

వివిధ అంశాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలు కూడా తమ నివేదికలను సమర్పించాయి. వాటిని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. భారత ప్రభుత్వ యంత్రాంగం ఒక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌పైనే అధికంగా ఆధారపడుతున్నదని ఒక పార్లమెంటరీ స్థాయీసంఘం తన నివేదికలో పేర్కొన్నది. అయితే ఆ సర్వీస్‌ పేరు మాత్రం వెల్లడించలేదు. పోక్సో చట్టం కింద నమోదైన కేసులకు సంబంధించి బాలనేరస్థుల వయోపరిమితిని 18 నుంచి 16 ఏండ్లకు తగ్గించాలని మరో పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది. సీబీఐకి మరిన్ని అధికారాలు కల్పించేందుకు చట్టాలను సవరించాలని ఇంకో పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది.

Read More:

ఒకరి ప్రాణం కోసం ప్రయత్నించారు.. మరో నలుగురు ప్రాణాలు విడిచారు.. విషాదం నింపిన సెప్టిక్ ట్యాంక్

మళ్లీ పంజా విసురుతున్న కరోనా మహమ్మారి.. ఆ తరగతులకు స్కూళ్లు తెరిస్తే కఠిన చర్యలు.. విద్యాశాఖ ఆదేశాలు ‌