నారా లోకేష్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ
విజయవాడ: ఏపీ మంత్రి, టీడీపీ ముఖ్య నాయకులు నారా లోకేష్‌తో టీవీ9 మురళీ కృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం, ప్రచారంలో ప్రజల స్పందన, ప్రజా జీవితం వంటి పలు అంశాలపై లోకేష్ స్పందించారు. నా కులం, మతం, ప్రాంతం మంగళగిరి.. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తున్నప్పటికీ ఆందోళనేమీ లేదని, 150కి పైగా సీట్లు తాము గెలవబోతున్నామని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని నారా లోకేష్ చెప్పారు. గెలవలేని […]

విజయవాడ: ఏపీ మంత్రి, టీడీపీ ముఖ్య నాయకులు నారా లోకేష్‌తో టీవీ9 మురళీ కృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం, ప్రచారంలో ప్రజల స్పందన, ప్రజా జీవితం వంటి పలు అంశాలపై లోకేష్ స్పందించారు.
నా కులం, మతం, ప్రాంతం మంగళగిరి.. ఈ ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తున్నప్పటికీ ఆందోళనేమీ లేదని, 150కి పైగా సీట్లు తాము గెలవబోతున్నామని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని నారా లోకేష్ చెప్పారు. గెలవలేని సీటు తనకివ్వాలని, గెలుచుకొస్తానని పార్టీకి చెప్పినట్టు లోకేష్ తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా చేనేతలు ఉన్నారని, వాళ్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే తన ధ్యేయమని చెప్పారు. ‘నేను మంచి పని చేయడానికి వచ్చాను. నా కులం మంగళగిరి, మతం మంగళగిరి, ప్రాంతం కూడా మంగళగిరి అని లోకేశ్ చెప్పారు’.
బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ కలిసి ఏపీ సీఎంపై దాడికొస్తున్నాయి. టీడీపీ అభ్యర్ధులకు కేటీఆర్ ఫోన్ చేసి పోటీ ఉపసంహరించుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లో మీ ఆస్తులున్నాయి కదా, మిమ్మల్ని ఇబ్బంది పెడతామని కూడా వారితో కేటీఆర్ చెప్పారని లోకేష్ ఆరోపించారు.
కేసీఆర్‌కు ఏపీలో ఏం పని
కేసీఆర్‌కు ఏపీలో ఏం పని? ఏపీకి ప్రచార రధాలు పంపిస్తున్నారు, డబ్బులు పంపిస్తున్నారని లోకేష్ అన్నారు. ఆంధ్రలో జోక్యం చేసుకుంటే తాము ఊరుకోవాలా అని అన్నారు. కేసీఆర్ ద్వారా ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని ఇప్పటి దాకా కేసీఆర్ ఎందుకు కేంద్రానికి లేఖ రాయలేదు? పోలవరానికి వ్యతిరేకంగా ఇంకా ఎందుకు పోరాడుతున్నారు? ఏపీలో తమకు ఒక పోర్ట్ కావాలని ప్రధానికి లేఖ ఎందుకు రాశారంటూ లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.
హోదా కుదరదంటేనే ప్యాకేజీకి ఒప్పుకున్నాము
ఏ రాష్ట్రానికీ హోదా ఇవ్వడంలేదని చెబితే, ప్యాకేజీకి ఒప్పుకున్నాము. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు, అందుకే జాతీయ స్థాయిలో పెట్టుకున్న పొత్తు ఇక్కడ కొనసాగలేదని తెలిపారు. వైసీపీ, బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో ఉండి నీతులు చెబుతున్నారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి వాళ్లకు కనబడటం లేదు.
ఢిల్లీ తరహా రాజధాని వస్తుందని చెప్పిన మోడీ రూ. 15, 000 కోట్లు మాత్రమే ఎలా విడుదల చేస్తారని లోకేశ్ ప్రశ్నించారు. మోడీ గారు దేశానికి ప్రధాని కాదని, గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని అని విమర్శించారు. కేద్రంలో మళ్లీ మోడీ వస్తే తాము రాజీ ధోరణి అవలంబించే ప్రశక్తే లేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 18 హామీలపైన చేతల్లో ఏమైనా చూపిస్తే తప్ప తాము మద్దతివ్వడంపై ఆలోచించమని లోకేష్ స్పష్టం చేశారు.
కార్యకర్తగానే ఉంటా
ఈ ఎన్నికల తర్వాత నా స్థాయి తెలుగదేశం పార్టీ కార్యకర్తగానే ఉంటుంది. అధ్యక్షులు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని లోకేష్ చెప్పారు.
తాను మాట్లాడిన దానిలో ఒక పదం అటో ఇటో ఉంటే దాన్ని పట్టుకుని గుచ్చి గుచ్చి ఎత్తి చూపుతున్నారని, అది వదిలేసి తాను చేసిన అభివృద్ధి చూడాలని లోకేష్ చెప్పారు. ఏపీకి తాను 120 అవార్డులు తీసుకొచ్చానని తెలిపారు. జగన్ ఒక సీఎం కుమారుడిగానే ఎన్నో డబ్బులు తినేస్తే, సీఎం అయితే ఇంకెన్ని డబ్బులు తినేస్తారో ప్రజలు గమనించాలని లోకేష్ అన్నారు.