General Elections 2024: విపక్షాల ఐక్యత కోసం జూన్ 23న కీలక భేటీ.. ఎన్డీఏ బలోపేతానికి కమలం కసరత్తు.. ఆసక్తికరంగా జాతీయ రాజకీయాలు
నరేంద్ర మోదీని గద్దెదింపేందుకే అని చెప్పుకోవాల్సి వుంటుంది. ఇపుడు కలుస్తున్న పార్టీల అధినేతల్లో ఎవరికి వారు తాము ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యం వున్న వారే. కానీ, హస్తిన పీఠం మీద నరేంద్ర మోదీ ఉన్నంతకాలం...
2019 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను తారుమారు చేసే సంకల్పంతో విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను ఢీకొనాలంటే బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీభేషజాలను పక్కనపెట్టి మరీ ఒక్కటవ్వాలని భావిస్తున్నాయి. అందులో భాగంగా తొలి కీలక భేటీ జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో జరగబోతోంది. ఇలాంటి ప్రయత్నాలు గతంలో చాలానే జరిగినా ఓ కార్యరూపాన్ని సంతరించుకోలేదు. కానీ ఈసారి మాత్రం దాదాపు 18 విపక్షాలు ఒకే మాట మీద నిలిచేలా కనిపిస్తున్నాయి. అది వారి ప్రయోజనం కోసమే అనేకంటే నరేంద్ర మోదీని గద్దెదింపేందుకే అని చెప్పుకోవాల్సి వుంటుంది. ఇపుడు కలుస్తున్న పార్టీల అధినేతల్లో ఎవరికి వారు తాము ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యం వున్న వారే. కానీ, హస్తిన పీఠం మీద నరేంద్ర మోదీ ఉన్నంతకాలం వారి కోరిక కలగానే మిగిలిపోతుందన్న భయాందోళనే ఇపుడు వారందరినీ కామన్ ప్లాట్‌ఫామ్ మీదకు తెస్తుందని చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న భేటీని బీహార్ సీఎం, జెడియూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ నిర్వహిస్తున్నారు. తొలుత జూన్ 12నే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నితీశ్ భావించినా.. కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డింది. తమ అభిప్రాయం తీసుకోకుండానే నితీశ్ ఏకపక్షంగా విపక్షాల సమావేశం తేదీని, వేదికను ఖరారు చేశారని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదిలోనే హంసపాదు ఎందుకు అనుకున్నారో ఏమోగానీ నితీశ్ కుమార్ వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలకు అనుకూలమైన తేదీని నిర్ణయించారు. సమావేశాన్ని సిమ్లాలోనిర్వహించాలని కాంగ్రెస్ నేతలు భావించినా.. అది రాంగ్ సిగ్నల్స్ వెళ్ళడానికి కారణమవుతుందనుకున్నారో ఏమో నితీశ్ నిర్ణయించిన పాట్నానే వేదికగా కాంగ్రెస్ నేతలు అంగీకరించారు. దాంతో పాట్నా భేటీకి ముహూర్తం, వేదిక ఖరారయ్యాయి.
భిన్నాభిప్రాయాలపై మధ్యేమార్గమేది?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష నేతలంగా చేయి చేయి కలిపి తమ సత్తా చాటనున్నారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతా దళ్, ఎన్సీపీ, డిఎంకే, శివసేన (ఉద్ధవ్ వర్గం), సీపీఎం, సీపీఐ సహా 18 జాతీయ, ప్రాంతీయ పార్టీలు 23న పాట్నాలో సమావేశమై మోదీ చరిష్మాను ఎదుర్కోవడానికి అవసరమైన వ్యూహాలను రచించనున్నాయి. దేశంలో అత్యంత బలవంతుడైన నేత నరేంద్ర మోదీని ఎదిరించి నిలబడుతున్న రాహుల్ గాందీ, అరవింద్ కేజ్రివాల్, మమతా బెనర్జీ వంటి వారు ఈ సమావేశానికి హాజరై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. మోదీ లక్ష్యంగా వ్యూహరచన అయితే చేయవచ్చుగానీ తమలో తమకున్న భిన్నాభిప్రాయాలను విపక్ష నేతలు ఎలా పరిష్కరించుకుంటారు? ఎలాంటి మధ్యే మార్గాన్ని ఎంచుకుంటారు? అన్నదే ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తుంది. అందుకు కారణాలు చాలానే వున్నాయి. 23న భేటీ కానున్న రాజకీయ పార్టీల నేతల్లో ఎవరికి వారికే ప్రధానమంత్రి పదవి తమకే దక్కాలన్న ఆశతో ఉండడం అనేది విపక్షాల ఐక్య కూటమికి అతిపెద్ద హర్డిల్. ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఓట్లు చీలకుండా ఉండడానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి చొరవ తీసుకున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ బీజేపీకి దీటుగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపుదామని ఆయన ప్రతిపాదించారు. దాదాపు ఇలాంటి ప్రతిపాదనే నితీశ్ కంటే ముందు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా చేశారు. తమకు బలం లేని చోట కాంగ్రెస్ పార్టీ… ఆ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా వున్న పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని మమత ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పాట్నా భేటీలో ఈ అంశంపై కాంగ్రెస్ వైఖరేంటో విపక్షాలు వివరించే అవకాశముంది.
ఆప్ ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా?
ప్రాంతీయ పార్టీల మధ్య నెలకొన్న రాజకీయ వైరం ప్రతిపక్షాల ఐక్యతకు అసలు సిసలైన సవాల్‌గా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉప్పు నిప్పుగా ఉన్న టీఎంసీ, లెఫ్ట్ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకురావడం కష్టమనే అభిప్రాయాలు బలంగా వున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి వాటితో కాంగ్రెస్ కలిసే అవకాశం లేదు. సీట్ల సర్దుబాటు అంశం కూడా పార్టీల సయోధ్యకు అతిపెద్ద సవాలేనని చెప్పాలి. ఇదంత సులువైన పని కాదన్నది పరిశీలకుల అభిప్రాయం. బెంగాల్, అస్సాం, జార్ఖండ్, కేరళ, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంత సులభంగా కనిపించడం లేదు. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 172 లోక్‌సభ స్థానాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్ , రాజస్తాన్‌లలో తాము పోటీకి దిగమని హామీ ఇస్తోంది. అందుకు బదులుగా తాము అధికారంలో వున్న ఢిల్లీలోని ఏడు, పంజాబ్‌లోని 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయొద్దని కోరుతోంది. అయితే, పంజాబ్‌లోని మొత్తం 13 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీలున్నారు. అలాంటి చోట పోటీ నుంచి వైదొలిగేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించడం కష్టం. సో.. ఆప్ షరతును కాంగ్రెస్ అధినాయకత్వం అంగీకరించకపోవచ్చు. నిజానికి ఏ ఏ సీట్లలో ఏ పార్టీకి బలముందనే విషయంపై విపక్షాలలో ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ అధిక సంఖ్యలో సీట్లు కాంగ్రెస్‌కు కేటాయించడానికి సిద్ధంగా లేరు. బీజేపీపై ఉమ్మడి అభ్యర్థిని నిలపకపోతే మోదీని ఎదుర్కోవడం కష్టసాధ్యమని నితీశ్ కుమార్ గట్టిగానే వాదస్తున్నా.. అది ఆచరణలో ఏ మేరకు సాధ్యమనే దానిపై ఆయనకూ క్లారిటీ వుంది. ఆ దిశగా ఆయన విపక్షాలను ఎంతవరకు ఒప్పించగలరన్నది అనుమానమే.
బీజేపీ ఆత్మావలోకనం!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకున్న చరిష్మాను తట్టుకొని నిలబడాలంటే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని రాజకీయ విశ్లేషకులు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవడం కష్టమేనని వారే చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య విజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసాన్ని రెట్టింపు చేసింది. దానికి తోడు భారత్ జోడో యాత్ర తమ నేత రాహుల్ గాంధీ ఇమేజ్‌ని అమాంతం పెంచేసిందని, ఆ ఇమేజీతో ఇపుడు రాహుల్ గాంధీ .. నరేంద్ర మోదీని ఈజీగా ఎదుర్కొనగలరని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందువల్లే సోషల్ మీడియాలో నరేంద్ర మోదీపైనా, బీజేపీ పాలనపైనా వ్యతిరేక ప్రచారాన్ని ఉర్రూతలెక్కిస్తున్నారు. అయితే కీలకాంశాలపై తొలి భేటీలోనే ఓ క్లారిటీ రావడం సాధ్యం కాదు కాబట్టి, ప్రస్తుతానికి మోద ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి వాటి ఆధారంగా మూకుమ్మడిగా దేశవ్యాప్తం ప్రచారాన్ని ప్రారంభించాలని పాట్నా భేటీలో తీర్మానించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అధిక ధరలు, నిరుద్యోగంతో పాటు మతం పేరుతో సమాజాన్ని చీల్చే చర్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి ఆందోళన వ్యూహాన్ని పాట్నా భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. ఒకవైపు విపక్ష పార్టీ లన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటికే పలు పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ వ్యూహకర్తలు దృష్టి సారించారు. మహారాష్ట్రలో శివసేన దూరమయ్యాక ఆ పార్టీని చీల్చి ఏక్‌నాథ్ షిండేని సీఎంను చేసిన బీజేపీకి ఇప్పుడు షిండే వైఖరి కూడా మింగుడు పడడం లేదని సమాచారం. బీజేపీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేకి జనాదరణ అధికంగా ఉందంటూ ఇటీవల పేపర్ ప్రకటన ఇవ్వడం బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లు ప్రచారం జరుగుతోంది.తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై జయలలితపై చేసిన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది. అక్కడా రెండు పార్టీల మధ్య అంతరం పెరిగింది. ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎం, డిప్యూటీ సీఎంలతో జరిగిన సమావేశంలో తమతో కలిసే మిత్రపక్షాలను అక్కున చేర్చుకోవాలని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పాత మిత్రుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయినట్లు హస్తినవర్గాలు చెప్పుకుంటున్నాయి. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీఏకి గుడ్‌బై కొట్టిన పంజాబీ పార్టీ శిరోమణి అకాలీదళ్‌ను కూడా తిరిగి ఎన్డీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం.
దేవెగౌడ కామెంట్ల పరమార్థమేంటి?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా చతికిలపడిన మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని చూస్తోంది. ఇటీవల సెంట్రల్ విస్టా (కొత్త పార్లమెంటు భవనం) ప్రారంభానికి విపక్షాలన్నీ దూరంగా వుంటే మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో కలిసి హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్లు కూడా ఆసక్తి రేపాయి. దేశంలో ఏ పార్టీకి బీజేపీతో సంబంధం లేదో చెప్పాలని దేవెగౌడ చేసిన కామెంట్లు సంచలనమయ్యాయి. జేడీఎస్ బీజేపీతో కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. బీహార్‌లో కులప్రాతిపదికన చిన్న పార్టీ లను కలుపుకొని వెళితే మేలన్న యోచనలో బీజేపీ ఉంది. లోక్‌జనశక్తి పార్టీ (చిరాగ్ చీలిక వర్గం) ఎన్డీఏకి దూరం కాకుండా చర్యలు తీసుకుంటూనే హిందూస్తాన్ అవామ్ మోర్చా (HAM) దగ్గరకు తీసుకునే చర్యలు చేపడుతోంది. నితీశ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండే ఇటీవల విభేదాల కారణంగా బయటకు వచ్చిన వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) చీఫ్ ముకేశ్ సాహ్నితో కూడా మంతనాలు సాగిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్ రాజ్‌బహార్‌కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించారు. యూపీ బీజేపీ అధ్యక్షుడు చౌధరి భూపేంద్ర సింగ్ వారణాసిలో జరిగిన రాజ్‌బహార్ వ్యక్తిగత కార్యక్రమానికి హాజరయ్యారు. ఇలా అన్ని వైపుల నుంచి ఎన్డీఏని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువు మాత్రమే వుండడంతో ఒకవైపు విపక్షాల కూటమికి ప్రతిపక్షాలు కార్యాచరణ రూపొందిస్తుంటే.. ఎన్డీఏను బలోపేతం చేయడం కోసం కమలనాథులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తానికి పాలక, ప్రతిపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో దేశం ఎన్నికల దిశగా పయనం సాగిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..