విజయవాడ: ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ వైసీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రత్యేకహోదా అన్నది వైసీపీ నేతలకు బోరింగ్ సబ్జెక్టుగా కనిపిస్తోందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను లోక్ సభ సభ్యులుగా గెలిపిస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు.
వాన్ పిక్, లేపాక్షి, బ్రాహ్మణీ స్టీల్స్ కేసుల్లో జగన్ చిక్కుకున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర చేశారనీ, ఫామ్-7 ద్వారా దాదాపు తొమ్మిది లక్షల ఓట్లను తొలగించేందుకు మరో కుట్ర చేశారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఏపీలో మళ్లీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.