‘నా సోదరుడికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించండి’ , ఘజియాబాద్ అధికారులకు మంత్రి వీకే .సింగ్ అభ్యర్థన
దేశంలో కోవిడ్ మహమ్మారి ఎంత బీభత్సంగా ఉందో, కోవిడ్ రోగులు ఎన్ని పాట్లు పడుతున్నారో, ఈ వైరస్ బారిన పడిన తమవారిని ఆదుకునేందుకు సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు ఎలా ప్రయత్నిస్తున్నారో తెలిపే ఉదాహరణ ఇది !
దేశంలో కోవిడ్ మహమ్మారి ఎంత బీభత్సంగా ఉందో, కోవిడ్ రోగులు ఎన్ని పాట్లు పడుతున్నారో, ఈ వైరస్ బారిన పడిన తమవారిని ఆదుకునేందుకు సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు ఎలా ప్రయత్నిస్తున్నారో తెలిపే ఉదాహరణ ఇది ! కోవిడ్ పేషంట్ అయిన తన సోదరునికి ఆసుపత్రిలో బెడ్ ను కేటాయించడంలో సాయపడాల్సిందిగా కేంద్ర మంత్రి జనరల్ వీకే. సింగ్ తన ఘజియాబాద్ నియోజకవర్గ అధికారులను కోరారు. ఈ మేరకు ఆయన చేసిన ట్వీట్ ఈ దేశంలో వైద్య పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పకనే చెబుతోంది. అయితే తన ఈ ట్వీట్ అపోహలకు దారి తీయవచ్చునని భావించిన ఈయన ఆ తరువాత దాన్ని తొలగించారు.’నా బ్రదర్ ఒకరికి హాస్పిటల్ బెడ్ లభించేలా చూడండి’ అని సింగ్ ఘజియాబాద్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఇది చూసిన ట్విటర్ యూజర్లు.. ఈ ఇండియాలో ఒక మంత్రి సైతం తన బంధువుకు మెడికల్ సాయం కావాలని కోరడం శోచనీయమని, మన మెడికల్ సిస్టం ఇంత ఘోరంగా ఉందని పేర్కొన్నారు. ఇదీ మన దేశ వైద్య పరిస్థితి అని సెటైర్ వేశారు. కాగా…. ఆ వ్యక్తి తన రక్తం పంచుకున్న సోదరుడు కాదని, తన సోదరుని వంటివాడని జనరల్ సింగ్ స్పష్టం చేశారు.
ఈ వైనంపై స్పందించిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ఎన్నికైన ఓ ప్రజా ప్రతినిధి, సాక్షాత్తూ ఒక కేంద్ర మంత్రి నిస్సహాయతను ఈ ట్వీట్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు. ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేటుకు జనరల్ సింగ్ ఓ అభ్యర్థన పంపారని ఈ ఎంపీ పేర్కొన్నారు. దేశంలో మన వైద్య రంగ పరిస్థితి ఇలా ఉందని ఆమె కూడా పరోక్షంగా అభివర్ణించారు. కోవిడ్ సెకండ్ వేవ్ పాండమిక్ ఇంత దారుణంగా ఉందని ప్రజలు నిట్టూరుస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, టీకామందుల ఉత్పత్తి పెంచేలా ఆయా కంపెనీలను ప్రభుత్వం కోరాలని వారు అభ్యర్థిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నా ఆరోగ్యం కుదుటపడుతోంది… త్వరలోనే మీ ముందుకు వస్తా.. పవన్ కళ్యాణ్ భావోద్వేగ లేఖ…