PM’s Cabinet Expansion: ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తుందా? ఇస్తేగిస్తే.. ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్?
PM Modi's Cabinet Rejig: కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కేంద్ర కేబినెట్‌ను విస్తరించేందుకు అగ్రనాయకత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది.
(మహాత్మ కొడియార్, టీవీ9 తెలుగు, ఢిల్లీ బ్యూరో)
కేంద్ర మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ వార్తలు దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ నేతల్లో ఆశలు పుట్టిస్తోంది. వివిధ కారణాల వల్ల ఏర్పడ్డ ఖాళీలతో పాటు కొందరు నేతలకు ముందే ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం కేంద్ర కేబినెట్‌ను విస్తరించేందుకు అగ్రనాయకత్వం గత కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో దాదాపు 20 నుంచి గరిష్టంగా 27 మంది వరకు కొత్తగా చోటు కల్పించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్న కొందరికి వారి పనితీరు ఆధారంగా ఉద్వాసన కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీయే-2 మంత్రివర్గంలో ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యమే లభించని ఆంధ్రప్రదేశ్‌కు ఈసారి చోటు కల్పించవచ్చని నేతలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీ నుంచి ఎవరికి చోటిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది.
4:1 నిష్పత్తి ఏపీకి వర్తించేనా? లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన సీట్ల ఆధారంగా ప్రతి నలుగురు ఎంపీలకు ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవి ఇవ్వడంలో ఇదే సూత్రం అమలుచేశారని చెప్పుకుంటున్నారు. గెలిచినవారిలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు ఉన్నారు. ఈ నలుగురిలో సీనియారిటీతో పాటు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్లో జాతీయస్థాయిలో పనిచేసిన అనుభవం, అగ్రనాయకత్వంతో సాన్నిహిత్యం కిషన్ రెడ్డికి కలిసొచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీ ఒక్కసీటును కూడా గెలుచుకోలేకపోయింది. అందుకే ఏపీ నుంచి ఎవరికీ చోటు దక్కలేదు. లోక్‌సభకు ఏపీ నుంచి బీజేపీ తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోయినా, రాజ్యసభకు అనుకోనిరీతిలో నలుగురు సభ్యులు కొత్తగా చేరారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న మాజీ మంత్రి వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వీరిలో గరికపాటి మోహన్ రావు పదవీకాలం ముగిసిపోయింది. పైగా ఆయన ప్రాతినిధ్యం వహించింది తెలంగాణ నుంచి. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ మద్ధతుతో ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీజేపీ నేత సురేశ్ ప్రభును కలుపుకుంటే, ఏపీ నుంచి లెక్క 4కు చేరుకుంటుంది. లోక్‌సభకు వర్తింపజేసిన సూత్రం 4:1 నిష్పత్తిని రాజ్యసభకు కూడా వర్తింపజేస్తే ఏపీ నుంచి మిగిలిన నలుగురిలో ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.
సీఎం రమేశ్ – సెంట్రల్ మినిస్టర్ రమేశ్ అవుతారా? బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటును కూడా ఇవ్వని ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు జరగబోయే కేబినెట్ విస్తరణలో ప్రాతినిథ్యం కల్పిస్తారా? అన్నదే అసలు ప్రశ్న. ఇది కాసేపు పక్కనపెట్టి, ఒకవేళ ఏపీ నుంచి కూడా చోటివ్వాలని భావిస్తే ఎవరికిస్తారన్న మరో ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ బీజేపీ నేతల్లో వైఎస్ చౌదరి (సుజనా) విద్యాధికుడు, ఇప్పటికే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అది కూడా మోదీ నేతృత్వంలోని ఎన్డీయే-1లోనే మంత్రిగా పనిచేసినందున ప్రస్తుత అగ్రనాయకత్వం సహా కేంద్ర మంత్రివర్గంలో చాలామందితో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. రాజకీయంగా చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం స్థానాన్ని ఆక్రమించుకోవాలని బీజేపీ భావిస్తున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి తెలుగుదేశం నుంచి నేతలను బీజేపీలోకి లాక్కురావడానికి కూడా సుజనా చౌదరి ఉపయోగపడతారని పార్టీ భావించింది. అనుకున్నట్టే ఆయన కొందరు నేతలను పార్టీలోకి లాక్కొచ్చినా, ఆ తర్వాత ఆయన అమరావతి రాజధాని అంశానికే పరిమితమయ్యారు. దీనికి తోడు సుజనాకు చెందిన కొన్ని కంపెనీలపై రుణాల ఎగవేత ఆరోపణలు, కేసులు ఆయనకు ప్రతికూలాంశాలుగా మారాయి.
ఇక మరో నేత టీజీ వెంకటేశ్ కూడా ఆశావహుల్లో ఒకరిగా ఉన్నారు. నిజానికి టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సమయంలో మిగతా ముగ్గురు ఎంపీలు మంత్రిపదవికి తన పేరునే సూచించారని చెబుతున్నారు. పైగా తనకు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ సంస్థలతో ఉన్న అనుబంధం, వ్యాపారాల్లో ఎలాంటి ఆరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసొచ్చే సానుకూలాంశాలని ఆయన భావిస్తున్నారు.
మరో ఎంపీ సురేశ్ ప్రభు విషయం గమనిస్తే.. ఎన్డీయే-1లో కేంద్ర మంత్రిగా పనిచేసిన సురేశ్ ప్రభును జాతీయ నాయకత్వం ఎందుకనో ఎన్డీయే-2లో కొనసాగించలేదు. మరోవైపు ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇవన్నీ పక్కనపెట్టినా, రాజ్యసభ పదవీకాలం వచ్చే ఏడాది ముగుస్తోంది. ఆ మాటకొస్తే సురేశ్ ప్రభుతో పాటు వైఎస్ చౌదరి, టీజీ వెంకటేశ్‌ల పదవీకాలం కూడా 2022 జూన్ 21తో ముగుస్తోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క సీటు కూడా లేని బీజేపీకి ఆ రాష్ట్రం నుంచి సభ్యులను మళ్లీ తిరిగి ఎన్నుకునే అవకాశమే లేదు. ఇవన్నీ ముగ్గురికీ ప్రతికూలాంశాలుగా మారనున్నాయి.
ఈ ముగ్గురూ పోగా మిగిలిన ఎంపీ సీఎం రమేశ్‌కు పదవీకాలం 2024 ఏప్రిల్ 2 వరకు ఉంది. అంటే ఎన్డీయే-2 ప్రభుత్వం తన పదవీకాలాన్ని పూర్తిచేసుకునేవరకు సీఎం రమేశ్‌కు రాజ్యసభ పదవి ఉంటుంది. దీంతోపాటు కొన్ని కీలక బిల్లులను పాస్ చేసే సమయంలో సీఎం రమేశ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేసి పార్టీ నాయకత్వాన్ని ఆకట్టుకున్నారు. ఆ తర్వాత స్వల్ప తేడాతో ఓడిపోయిన రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను తారుమారు చేయడంలో కూడా సీఎం రమేశ్ తనవంతు ప్రయత్నాలు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా తనకు రాష్ట్రంలో ఇతర పార్టీల్లోని బలమైన నేతలను బీజేపీలోకి లాక్కొచ్చే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, ఇవన్నీ తనకు ప్లస్ అవుతాయని సీఎం రమేశ్ భావిస్తున్నారు. ఒకవేళ ఏపీ నుంచి కేంద్ర కేబినెట్‌లో ఎవరికైనా చోటు కల్పించాలనుకుంటే, తనకు తప్ప మరెవరికీ అవకాశం లేదని ఆయన ధీమాతో ఉన్నారు.
ఈ నలుగురితో పాటు ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించకపోయినా మరో తెలుగు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా రేసులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జీవీఎల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా పార్టీ నాయకత్వం ఆయనకు ఏపీలో పార్టీని విస్తరించే బాధ్యతలు అప్పగించింది. ఒకవేళ ఏపీ నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తే, జీవీఎల్ కూడా రేసులో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ తరహాలో సమీకరణాలు, లెక్కల గురించి ఆంధ్రా నేతలు విశ్లేషించుకుంటుంటే, అగ్రనాయకత్వం ఊరించి, ఊరించి ఉసూరుమనిపిస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు.
Also Read..
ఖమ్మం కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి భేటీ వ్యూహమా? రొటీన్‌లో భాగమా?