TPCC Women Congress President: చిక్కుముడి వీడింది.. టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావు నియామకం..
PCC Women Congress President Sunita Rao: టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ.
టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సునీత రావును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపికపై కూడా కసరత్తు చేసి చివరికి సునీత రావును ఎపింక చేసింది కేంద్ర నాయకత్వం. రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళా నేతల పూర్తి వివరాలు తెప్పించుకున్న జాతీయ మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్… వారిని ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేశారు.
కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడంతోపాటు మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా కల్గిన నాయకురాలికే మహిళా అధ్యక్షురాలి పీఠాన్ని అప్పగించింది. గతంతో పీసీసీ అధికార ప్రతినిధులు సునీతారావు బాధ్యతలు నిర్వహించారు. NSUIతోపాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న సునీతారావును ఫైనల్ చేశారు. నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా, పీసీసీ అధికార ప్రతినిధిగా పని చేశారు. అదేవిధంగా మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండడం, భాషపై పూర్తి పట్టుండడం వంటి అంశాలతోపాటు పార్టీకి విధేయురాలిగా పని చేస్తున్న భావన కూడా పార్టీలో ఉండడంతో ఆమెకే ఈ పదవి వరించింది.
కాంగ్రెస్ పార్టీలో… పీసీసీ అధ్యక్షుడి పదవికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే సమానంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పాత్ర ఉంటుంది. ఈ మహిళా విభాగం అధ్యక్ష పదవిలో ఉండే నాయకురాలు… పీసీసీతో సమానంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడంతో పాటు మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాల్సి ఉంటుంది. కానీ సుదీర్ఘ కాలంగా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద పని చేస్తున్నారు. శారద ఇటీవల కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. దీంతో నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికతోపాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది.