Tirupati: ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ముత్యపుపందిరి వాహనంపై ఊరేగిన శ్రీ అలమేలు మంగ
Tirupati: తిరుమల వెళ్లేవారు తిరుచానూరు పద్మావతిని దర్శించుకుంటారు. శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పద్మావతిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరిని శ్రీవారి భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు శ్రీ అలమేలుమంగ ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో ఊరేగారు.
Photo 8
Follow us
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలో శంఖుచక్రాలతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు.
కోవిడ్-19 నేపథ్యంలో ఆలయం వద్దగల వాహన మండపంలో ఉదయం 8 నుండి 9 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం, ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది. అందుకనే ఈ గ్రామాన్ని తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం అని పిలుస్తారు.
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి.
ముద్దులొలికించే ముత్యాలు అలిమేలుమంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతికార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపుచిప్పల్లో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని, తామ్రనదీతీరంలో లభిస్తాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు.
తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలిగి, కైవల్యం ఫలంగా చేకూరుతుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టిటిడి బోర్డు సభ్యుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరిబాయి తదితరులు పాల్గొన్నారు.