- Telugu News Photo Gallery Spiritual photos Srivari annual brahmotsavam 9th day grand chakrasnanam observed in ekantham
Bhramotsavam: సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు.. శ్రీవారికి వైభవంగా చక్రస్నానం
Brahmotsavam: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం ఉదయం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం ఐనా మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు.
Updated on: Oct 15, 2021 | 5:09 PM

చక్రస్నానం వలన ఈ ఉత్సవాలు చేసినవారికి, చేయించినవారికి, ఇందుకు సహకరించినవారికీ, దర్శించిన వారికీ.. అందరికీ ఈ ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుంది.

ముందుగా విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం నిర్వహించారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. వీటిని శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమయుక్తంగా స్నపనం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశశాంతి మంత్రములు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం వంటి పంచసూక్త మంత్రములు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానము చేసే వేదాలను టిటిడి వేదపారాయణదారులు పారాయణం చేశారు.

అభిషేకానంతరం వివిధ పాశురాలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యంగార్, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ్యంగార్లు పఠించారు. ఈ వేడుకలో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్ప మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు.

తొమ్మిదిరోజుల ఉత్సవాలలో జరిగిన అన్ని సేవలూ సఫలమై.. లోకం క్షేమంగా ఉండడానికీ, భక్తులు సుఖశాంతుల్తో ఉండడానికీ చక్రస్నానం నిర్వహించారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక యజ్ఞాంతంలో అవభృథస్నానం’ చేస్తారు.

యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాలవల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడంకోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు.

ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.

కన్నుల పండుగగా జరిగున చక్రస్నానం ఘట్టం..

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమా కోహ్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇతర అధికారులు పాల్గొన్నారు.





























