Rajitha Chanti |
Updated on: Jan 03, 2022 | 7:16 PM
ఈరోజు సోమవారం 23వ తేదీ వరకు అంటే 21రోజుల పాటు అధ్యయనోత్సవాలను, 24 నుంచి 26 వరకు విలాసోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో స్వాగతద్వారాలు, చాందినీ వస్త్రాలు, విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాలలో భాగంగా 13వ తేదీ వరకు నిత్య కళ్యాణాలను నిలిపివేయనున్నారు. 29న విశ్వరూపసేవ నిర్వహించనున్నారు.
భద్రగిరి పూర్తిగా రంగురంగుల విద్యుత్ దీపాల కాంతుల్లో ప్రకాశిస్తుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో సుమారు రూ.60 లక్షలు వెచ్చించారు.
అధ్యయనోత్సవం అంటే.. వేద ఇతిహాస పురాణ దివ్యప్రబందాదులను ఏకకాలంలో 21 రోజులపాటు స్వామివారికి విన్నవించడం. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాల్లో నిర్వహించాల్సిన వేడుకల్లో అధ్యయనోత్సవం అత్యంత ప్రధానమైనది.
పగల్ పత్తు, రాపత్తు నిర్వహిస్తారు. పగల్ పత్తు అంటే పగటిపూటి, రాపత్తు అంటే రాత్రిళ్లు నిర్వహించేవి. ఈ వేడుకలలో స్వామివారిని అందంగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అనంతరం స్వామివారిని ఆలయం నుంచి మిథిలా స్టేడియంలోని అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనం అనంతరం స్వామివారిని ఆలయానికి తీసుకెళ్తారు.
వైకుంఠఏకాదశి సందర్భంగా జరుగు అధ్యయనోత్సవాల లో భాగంగా మొదటి రోజు కావున ఈరోజు మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు సీతారామ ప్రభువు.
ప్రళయకాలమున నిదురలో మునిగి ఉన్న బ్రహ్మ వద్ద నుంచి వేదాలను అపహరించి సముద్రంలో దాగిన సోమకాసురుడనే రాక్షసుడిని వధించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు ఇచ్చిన సందర్భంగా మహా విష్ణువు మత్య్సావతారాన్ని ధరించాడు.