- Telugu News Photo Gallery Spiritual photos Konaseema Vadapalli Venkateswara Swamy Kalyana Mahotsavam: A Divine Celebration
Vadapalli: కోనసీమ తిరుమలలో పండుగ వాతావరణం.. వైభవంగా వెంకన్న దివ్య కళ్యాణ మహోత్సవ సంబరాలు..
చందన స్వరూపుడిగా...ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు వెంకన్నగా వాడపల్లిలో కొలువైనా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో పాటు, ఆలయ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, డి.ఎస్.పి వంటి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కన్నుల పండుగగా ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు.
Updated on: Apr 09, 2025 | 5:13 PM

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవ సంబరాలు అంబరానంటుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ దివ్య కళ్యాణ మహోత్సవాల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ఆనంద పరవశంతో మంత్రముగ్ధులవుతున్నారు.

తొలిరోజు అంకురార్పణ జరగగా రెండవ రోజు మధ్యాహ్నం నిర్వహించిన స్వామివారి రథోత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. రథం లాగుతున్నంతసేపు వాడపల్లి గోవింద నామస్మరనతో మారుమోగింది.

వాడపల్లిలో రథోత్సవం సందర్భంగా రధాన్ని లాగేందుకు, రథోత్సవం తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. రాత్రి జరిగిన స్వామి వారి దివ్య కళ్యాణానికి పెద్ద ఎత్తున విఐపి లతోపాటు వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించి భక్తిపారవశ్యంలో మునిగితేలారు.

స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకురావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా కేరళతో పాటు వివిధ రాష్ట్రాల ప్రత్యేక నృత్యాలు, డంపు వాయిద్యాలు, మహిళల కోలాటాలు, వివిధ వేషధారణల ట్రూపులు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

స్వామి వారి దేవాలయం, కళ్యాణ వేదిక వద్ద పుష్పాలంకరణలు, పండ్లతో అలంకరణలు, విద్యుత్ కాంతులు భక్తులను కట్టిపడేసాయి. మరో ఐదు రోజులపాటు జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలు, వివిధ వాహన సేవ కార్యక్రమాలు కూడా కనుల పండుగగా పక్కా ప్రణాళిక ప్రకారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ అధికారులు తెలిపారు.

ఏడు శనివారాలు దర్శించుకొని, పదకొండు ప్రదక్షణలు చేసిన భక్తుల కోరికలు స్వామి వారు నెరవేరుస్తారని భక్తులు నమ్మకం. కనుక ఈ ఆలయంలో శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎర్ర చందన కొయ్యలో వెలసిన 'స్వయంభూ' క్షేత్రం 'వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి' వారి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 'కళ్యాణ వేంకటేశ్వరుడు' అని కూడా పిలుస్తారు.




