- Telugu News Photo Gallery Spiritual photos Kavadi utsavam held in visakha madhava dhara bhramaramba mallikarjuna swamy temple
Kavadi Utsavam: శివయ్య కోసం కాలినడకన కావడి యాత్ర.. మాధవధార నుంచి జలం తీసుకొచ్చి అభిషేకం.. యాత్ర విశేషమిదే..
శ్రావణ మాసంలో వచ్చే మొదటి ఆదివారం వాళ్లంతా భక్తిశ్రద్ధలతో లీనమవుతారు. కాషాయ వస్త్రాలు ధరించి.. హర హర శంభో శంకర అంటూ యాత్ర చేపడతారు. కొండల నుంచి జాలువాడిన జల ధార నుంచి నీటిని పట్టుకొని.. వాటిని కావడి మోస్తారు. కిలోమీటర్ల మేర నడిచి ఆ గంగాజలంతో పరమశివుడికి అభిషేకం చేస్తారు. మార్వాడిల కావడి యాత్ర గురించి తెలుసుకుందాం..
Maqdood Husain Khaja | Edited By: Surya Kala
Updated on: Aug 06, 2023 | 11:10 AM

తెల్ల తెల్లవారుతుండగా విశాఖలోని మాధవధార భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం శివనామస్మరణతో మారుమోగింది. కాషాయ వర్ణం వస్త్రాలతో చేరిన భక్తులతో ఆ ప్రాంతం శోభాయమానంగా మారింది. మహిళలు, పిల్లలు, వృద్ధులు అన్న తేడా లేకుండా కావడి చేపట్టి తెల్లవారుజామునే మాధవధార కొండకు చేరుకున్నారు. అక్కడ పరమాశివుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత యాత్ర ప్రారంభించారు.

ప్రతిఏటా పవిత్ర శ్రావణమాసంలో వచ్చే మొదటి ఆదివారం మార్వాడీలకు ప్రత్యేకత. ఆ రోజు కావడి శోభాయాత్ర చేయడం అనవాయితీ. మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఈ యాత్ర ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. విశాఖలో ఈ యాత్రను ప్రత్యేకంగా నిలుస్తుంది. నిష్టతో అంతా తెల్లవారుజామున లేచి.. పవిత్ర స్నానమాచరించి. మాధవదార కొండలకు చేరుకుంటారు.

ఈ రోజున స్వచ్చమైన నీటితో పరమశివున్ని అభిషేకిస్తే ఆ స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయనేది నమ్మకం. అంతా ఒక చోట చేరి తొలత మాధవధార భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. కొండల మధ్య నుంచి జాలువారే సహజసిద్ధ జలధారల నీటిని చిన్నచిన్న మట్టికుండల్లో సేకరిస్తారు. అప్పటికే సిద్ధం చేసుకున్న కావడికి నీటి కుండలను పెట్టి మోస్తారు.

చిన్నచిన్న కుండల్లో నీటిని పట్టి వాటిని కావడి కట్టి.. మోస్తూ బయలుదేరుతారు మార్వాడీలు. కాషాయ వస్త్రాన్ని ధరించి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహిస్తారు. హర హర శంభో శంకర అనుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తారు. లింగ వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో కావడి మోస్తారు.

మాధవధార నుంచి దాదాపుగా పది కిలోమీటర్లు నడిచి సిరిపురంలోని జగన్నాథ స్వామి ఆలయం వరకు చేరుకున్నారు. కావడి మట్టి కుండలో తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో అక్కడ శివలింగానికి అభిషేకాలు చేశారు.

మార్వాడీల కావడి యాత్ర మాధవధార ఆలయ నుంచి ప్రారంభమై బిర్లా జంక్షన్, కంచరపాలెం, రైల్వే న్యూ కాలనీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా సిరిపురం జగన్నాథ స్వామి ఆలయం వరకు సాగింది. అక్కడ పాండురంగపురంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు చేశారు.

వివిధ ప్రాంతాల నుంచి విశాఖలో స్థిరపడిన మార్వాడీలు సుఖ సంతోషంగా ఉండాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని ప్రతియేటా కావడి యాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి ఏడాది కూడా కావిడి యాత్ర భక్తిశ్రద్ధలతో సాగింది. మార్వాడీలతో పాటు సిందీ, రాజస్థానీ, స్థానికులు కూడా యాత్రలో భారీగా పాల్గొన్నారు.





























