- Telugu News Photo Gallery Spiritual photos Jupiter Transit Punarvasu: Auspicious Effects for 6 Zodiac Signs Dec Mar
గురు బలంతో ఆ రాశుల వారికి లాభాలే లాభాలు! ఊహించని శుభఫలితాలు
సాధారణంగా గురువు సొంత నక్షత్రాలలో సంచారం చేస్తున్నప్పుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నంత బలం కలుగుతుంది. గురువు ఈ నెల(డిసెంబర్) 6 నుంచి మార్చి 11 వరకు మిథున రాశిలో తన సొంత నక్షత్రమైన పునర్వసులో సంచారం చేయడం జరుగుతోంది. ఫలితంగా గురువు అనుకూలంగా ఉన్న రాశుల వారందరికీ కలలో కూడా ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి. మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. స్థితిగతుల్లో, జీవనశైలిలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దాదాపు వంద రోజుల జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది.
Updated on: Dec 09, 2025 | 6:06 PM

మేషం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతిగా అత్యంత శుభుడైన గురువు భాగ్య స్థానాన్ని వీక్షించడంతో పాటు సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందడంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వంటివి కూడా అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా కలుగుతుంది.

వృషభం: ఈ రాశికి లాభాధిపతి అయిన గురువు ధన స్థానంలో సొంత నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. అధికారులు మీ సలహాలు, సూచనలతో బాగా లబ్ధి పొందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంతాన యోగం పట్టే అవకాశం ఉంది.

సింహం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన గురువు లాభస్థానంలో, సొంత నక్షత్రమైన పున ర్వసులో సంచారం చేయడం వల్ల ఉద్యోగంలో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా యాక్టివిటీ బాగా పెరిగి లాభాల బాటపడతాయి. ఆరోగ్యానికి లోటుండదు. పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో, సొంత నక్షత్రంలో బలంగా ఉన్న గురు గ్రహం వల్ల ఈ రాశివారి స్థితి గతులు పూర్తిగా మారిపోతాయి. అపర కుబేరుడి స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కుటుంబంలో అత్యంత వైభవంగా శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ నిమిత్తం ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఊహించని శుభ వార్తలు వింటారు. సంతాన యోగం పడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, సంపద కలిసి వస్తాయి.

ధనుస్సు: రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో సొంత నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా ఒక వెలుగు వెలుగుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.

కుంభం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో సొంత నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి మార్చి 11 వరకు ఏలిన్నాటి శని దోషం వర్తించే అవకాశం లేదు. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. సంతానం కలగడానికి అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కుదరడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వైభవంగా సాగిపోతాయి.



