- Telugu News Photo Gallery Spiritual photos Ashada Purnima Horoscope: Gaja Kesari Yoga Boosts Luck for 6 Zodiac Signs. Details in Telugu
Ashada Purnima: పౌర్ణమి నుంచి గజకేసరి యోగం.. ఆ రాశుల వారి కలలన్నీ సాకారం!
Ashada Purnima Horoscope: ఈ నెల(జులై) 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చంద్రుడికి విపరీతంగా బలం పట్టబోతోంది. ఈ నెల 10వ తేదీన ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చంద్రుడు ముందు రోజు నుంచే ధనూ రాశిలోకి ప్రవేశించడం వల్ల రవితో సమసప్తక దృష్టి ఏర్పడి, పౌర్ణమి సంభవిస్తోంది. అయితే, రవితో కలిసి ఉన్న గురువు కూడా చంద్రుడిని వీక్షించడం వల్ల ఆ మూడు రోజుల్లో గజకేసరి యోగం కూడా ఏర్పడుతుంది. అందువల్ల ఈ మూడు రోజుల్లో కొన్ని రాశుల వారు మనసులో ఏం కోరుకున్నా నెరవేరే అవకాశం ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. మేషం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి కలలు సాకారం అవుతాయి.
Updated on: Jul 04, 2025 | 11:44 AM

మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో పౌర్ణమి, గజకేసరి యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ మూడు రోజులు ఈ రాశివారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడానికి అవకాశం కలుగుతుంది. మానసిక ఒత్తిడి బాగా తగ్గి సుఖ శాంతులు కలుగుతాయి. ఆదాయం పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు కలగడం, వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి.

మిథునం: ఈ రాశిలోని గురు, రవులతో చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడినందువల్ల ఈ రాశివారికి ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరగడంతో పాటు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సొంత ఇంటి కల, విదేశీ ఉద్యోగం కల నెరవేరుతాయి.

సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న గురు, రవులతో పంచమంలో ఉన్న చంద్రుడికి సమసప్తక దృష్టి ఏర్పడినందువల్ల ఈ రాశివారికి ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ విశేషంగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి.

తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో పౌర్ణమి ఏర్పడడం, గజకేసరి యోగం కలగడం వల్ల రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. మనసులోని కోరికల్లో చాలా భాగం నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. పిత్రార్జితం లభిస్తుంది. విదేశీ అవకాశాలు అంది వస్తాయి.

ధనుస్సు: ఈ రాశిలో ఉన్న చంద్రుడి మీద గురు, రవుల దృష్టి పడినందువల్ల చంద్రుడికి విపరీతంగా బలం పెరిగి, మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా సాకారం అవుతుంది. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడుగా ఎదిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది.

కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడిని పంచమ స్థానం నుంచి గురు, రవులు వీక్షించడం వల్ల అరుదైన పౌర్ణమి, గజకేసరి యోగం ఏర్పడడం జరిగింది. దీనివల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది.



