- Telugu News Photo Gallery Spiritual photos 5 Ancient Shiva Temples Linked to the Pandavas: know History and Significance
Historical temples India: వనవాస సమయంలో పాండవులు నిర్మించిన శివాలయాలు.. పురాతన ఆలయాలు ఎక్కడ ఉన్నాయంటే..
త్రిమూర్తులలో లయకారుడు శివుడు.. కేవలం జలంతో అభిషేకం చేసినా కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. అటువంటి శివుడిని స్వయంగా విష్ణువు అవతారమైన రాముడు, కృష్ణుడు పూజించారు. అనేక శివాలయాలను ప్రతిష్టించారు. అనేకాదు మహాభారతంలో పాండవులు తమ 12 సంవత్సరాల వనవాస సమయంలో శివుడిని పూజించారు. తాము నివసించే ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్టించారు. ఈ రోజు మన దేశంలోని పాండవులు ప్రతిష్టించిన శివలింగాల గురించి .. వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Jun 11, 2025 | 10:37 AM

ఎవరైనా ఏదైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదుర్కొంటుంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది దైవం హర హర మహాదేవుడు. ఎవరైనా భోలేనాథ్‌ను నిర్మలమైన భక్తితో శ్రద్దగా ప్రార్థిస్తే, శివుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో పలు ఆలయాలను నిర్మించారని చెబుతారు. మామలేశ్వర మహాదేవ ఆలయం, గంగేశ్వర మహాదేవ మందిరం, భోజేశ్వర ఆలయం, అంబరనాథ్ దేవాలయం పాండవులు నిర్మించారని చెప్పే పురాణ కథలు ఉన్నాయి.

మామలేశ్వర మహాదేవ ఆలయం, హిమాచల్ ప్రదేశ్: పాండవులు తమ వనవాస సమయంలో హిమాచల్ ప్రదేశ్‌లో కొంత సమయం గడుపుతారు. ఈ సమయంలో పాండవులు మామలేశ్వర మహాదేవ ఆలయాన్ని స్థాపించారు. ఇక్కడ భీముడు హిడింబను కలిశాడు. ఆమె అతని భార్య అయింది. ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదని చెబుతారు. ఈ ఆలయంలో భీముడి డ్రమ్ , 200 గ్రాముల గోధుమ గింజలు ఉన్నాయి. ఈ గోధుమ గింజను పాండవులు పండించారని నమ్ముతారు. మహాభారత కాలం నుంచి నిరంతరం మండుతున్న ఒక జ్వాల కూడా ఈ ఆలయంలో ఉంది.

అఘంజర మహాదేవ ఆలయం, హిమాచల్ ప్రదేశ్: ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలోని ఖనియారా గ్రామంలో ఉంది. అర్జునుడు తన వనవాస సమయంలో, శ్రీకృష్ణుని మార్గదర్శకత్వంలో ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని చెబుతారు. అర్జునుడి భక్తికి సంతోషించిన శివుడు అతనికి ఇక్కడే పాశుపతాస్త్ర ఆయుధాన్ని ఇచ్చాడు.

గంగేశ్వర ఆలయం, గుజరాత్: గంగేశ్వర ఆలయం గుజరాత్‌లోని డయ్యు నగరానికి దాదాపు 3 కి.మీ దూరంలో ఉన్న పాడుమ గ్రామంలో ఉంది. గంగేశ్వర అనే పేరు గంగా ..ఈశ్వరుడి కలయికతో ఏర్పడింది. గంగేశ్వర అంటే అర్థం గంగానదికి ప్రభువు. ఈ ఆలయం బీచ్‌లోని రాళ్ల మధ్య ఉన్న గుహలో ఉంది. ఇక్కడ ఐదు శివలింగాలు ఉన్నాయి. వీటిని పాండవులు తమ రోజువారీ పూజ కోసం ప్రతిష్టించారు. ఈ శివలింగాలు సముద్రం అధిక ఆటు పోట్ల సమయంలో సముద్రంలో మునిగిపోతాయి. తక్కువ ఆటుపోట్ల సమయంలో మాత్రమే కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని 'సముద్ర మందిర్రం' అని కూడా పిలుస్తారు.

భయహరణ మహాదేవ ఆలయం, ఉత్తరప్రదేశ్: భీముడు ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో తన వనవాస సమయంలో భయ హరణ మహాదేవ ఆలయాన్ని స్థాపించాడని చెబుతారు. ఈ ఆలయంలో ప్రార్థనలు చేయడం ద్వారా భక్తులు భయం, గందరగోళం నుంచి విముక్తి పొందుతారు. శివలింగంతో పాటు ఈ ఆలయంలో హనుమంతుడు, శివ-పార్వతి, సంతోషి మాత, రాధా-కృష్ణ, విశ్వకర్మ, బైజు బాబా మొదలైన వారి విగ్రహాలు కూడా ఉన్నాయి. శ్రావణ మాసం, మహాశివరాత్రి రోజులలో భారీ సంఖ్యలో ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. పురాణాల నమ్మకాల ప్రకారం.. భీముడు బకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి వెళ్ళే ముందు ఇక్కడ ఈ శివలింగాన్ని స్థాపించి పుజించాడని నమ్మకం.

లఖా మండల ఆలయం, ఉత్తరాఖండ్: లఖా మండల ఆలయం డెహ్రాడూన్ నుంచి 28 కి.మీ దూరంలో యమునా నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం పాండవులు లక్క ఇల్లు దహనం చేసిన తర్వాత ప్రాణాపాయం నుంచి తప్పించుకుని ఇక్కడ చాలా కాలం నివసించారని నమ్మకం. ఈ సమయంలో పాండవులు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించారు. వివిధ రంగులు.. పరిమాణాలలో రెండు శివలింగాలు ఉన్నాయి. శివలింగం స్పటికంలా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం లోపల ఉన్న రాతిపై పార్వతి దేవి పాదముద్రలు కనిపిస్తాయి. మహాశివరాత్రి రోజున ఈ శివుడి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడి కోరిక నెరవేరుతుందని నమ్మకం.



















