- Telugu News Photo Gallery Political photos Chandrababu Naidu family donate Rs.44 lakhs for Tirumala Tirupati Anna prasad distribution for his Grandson Nara Devansh birthday
Chandrababu Naidu: తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కుటుంబంతో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. చంద్రబాబు మనవడు దేవాన్స్ కూడా భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు.
Phani CH |
Updated on: Mar 21, 2025 | 1:07 PM

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మిణి, నారా దేవాన్ష్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబుకు స్వామివారి శేషవస్త్రాన్ని అందించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీ వేంకటేశ్వర స్వామి అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం వితరణ కేంద్రానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి, దేవాన్ష్‌లతో పాటు ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు.

దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల వెంకన్న భక్తులకు టిటిడి అందజేసే అన్నప్రసాద వితరణకు గాను సీఎం కుటుంబం ఒకరోజు అయ్యే ఖర్చు రూ.44 లక్షల విరాళం అందించారు. దీంతో ఒక రోజంతా అన్నప్రసాద భవనంలో దేవాన్ష్ పేరు మీద అన్నప్రసాద వితరణ చేస్తుంది టిటిడి.

విరాళం అందించిన అనంతరం అన్నప్రసాద కేంద్రంలో ప్రసాదాలను సీఎం చంద్రబాబు, దేవాన్ష్, లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మిణిలు వడ్డించారు. అనంతరం భక్తులతో కలసి అల్పాహారాన్ని స్వీకరించారు.

ప్రతి ఏడాది దేవాన్ష్ పుట్టినరోజు చంద్రబాబు కుటుంబ సభ్యులు అన్నదాన ట్రస్టుకు డొనేషన్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తొంది. ఇక దేవాన్ష్ నామకరణం, అన్నప్రాసన కూడా తిరుమలలోనే జరగడం విశేషం.





























