- Telugu News Photo Gallery Cricket photos Wpl 2023 5 teams captains and records meg lanning smriti mandhana harmanpreet kaur beth mooney
WPL 2023: భారత్ నుంచి ఇద్దరు.. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు.. తొలి డబ్ల్యూపీఎల్ సీజన్ సారథులు, రికార్డులు ఇవే..
BCCI: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఐదు జట్లలో మూడు జట్ల కెప్టెన్సీ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే దక్కింది.
Venkata Chari | Edited By: Ravi Kiran
Updated on: Mar 04, 2023 | 7:55 AM

బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. లీగ్ తొలి సీజన్‌లో ఐదు జట్లు పాల్గొనబోతున్నాయి. మొత్తం ఐదు జట్లు కెప్టెన్ల పేర్లను ప్రకటించాయి. ఐదు జట్లలో మూడు జట్ల కెప్టెన్లు ఆస్ట్రేలియా ప్లేయర్లు దక్కించుకోగా, రెండు జట్లకు భారత ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ పేరును ముందుగా ప్రకటించింది. తన కెప్టెన్‌గా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధానను ఎంచుకుంది. వేలంలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా స్మృతి నిలిచింది. RCB రూ. 3.40 కోట్లు వెచ్చించి, స్మృతిని దక్కించుకుంది.

భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. హర్మన్‌ను ఒక కోటి 80 లక్షల రూపాయలకు ముంబై దక్కించుకుంది. హర్మన్ తన కెప్టెన్సీలో టీహిండియాను టీ20 ప్రపంచ కప్ 2020 ఫైనల్స్‌కు చేర్చింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ను కూడా ఫైనల్స్‌కు తీసుకువెళ్లింది. ఈ ఏడాది కూడా జట్టు టీ20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. కానీ, ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ కం బ్యాటర్ అలిస్సా హీలీని యూపీ వారియర్స్ కేవలం రూ. 70 లక్షలకు కొనుగోలు చేసింది. అయినప్పటికీ ఆ టీం హీలీకి కెప్టెన్సీని అందించింది. టీ20 ప్రపంచ కప్‌లో హీలీ ఐదు మ్యాచ్‌లలో 47.25 సగటు, 115.95 స్ట్రైక్ రేట్‌తో 189 పరుగులు చేసింది. హీలీ గొప్ప బ్యాట్స్‌మెన్. అయినప్పటికీ ఆమెకు పెద్దగా కెప్టెన్సీ అనుభవం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆమె ఏం అద్భుతం చేస్తుందో చూడాలి.

గుజరాత్ జెయింట్స్ కెప్టెన్సీ ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ చేతిలో ఉంది. రెండు కోట్ల రూపాయలు వెచ్చించి గుజరాత్ ఈ ప్లేయర్‌ను దక్కించుకుంది. మూనీకి కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేకపోయినా బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకుంది. ఆమె 2018, 2020, 2023లో టీ20 ప్రపంచ కప్ విజేత జట్టులో భాగంగా నిలిచింది. మూడు బిగ్ బాష్ లీగ్‌లను కూడా గెలుచుకుంది.

ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ పేరును ప్రకటించింది. 5 ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మాగ్ లానింగ్‌కు సారథ్య బాధ్యతలు అందించింది. 100 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ప్రపంచ ఛాంపియన్‌ను ఢిల్లీ కోటి 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేసింది.





























