Smriti Mandhana Birthday: టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఈరోజు 28వ ఏట అడుగుపెట్టింది. ఆర్సీబీ జట్టుకు తొలి ట్రోఫీని అందించి రికార్డు సృష్టించిన స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లోనూ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆ జాబితాలో ఏమున్నాయో ఓసారి చూద్దాం..
Smriti Mandhana Birthday
Follow us
టీమిండియా క్రీడాకారిణి స్మృతి మంధాన ఈరోజు తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటుంది. జులై 18, 1996లో జన్మించిన స్మృతికి నేటితో 28 ఏళ్లు. 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్మృతి మంధాన ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సృష్టించింది. ఆ రికార్డుల లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం..
వన్డే క్రికెట్ ఛేజింగ్‌లో వరుసగా అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన ప్రపంచ రికార్డును స్మృతి మంధన్ సొంతం చేసుకుంది. 2021లో మంధాన వన్డే క్రికెట్లో వరుసగా 10సార్లు 50+ స్కోర్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును రెండుసార్లు గెలుచుకున్న తొలి భారతీయ స్టార్ స్మృతి మంధాన. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో క్రీడాకారిణి కూడా. ఇంతకు ముందు, ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లిస్ పెర్రీ రెండుసార్లు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. 2018, 2021లో ఈ అవార్డులను అందుకోవడం ద్వారా స్మృతి మంధాన పెర్రీ రికార్డును సమం చేసింది.
ఆస్ట్రేలియాలో వన్డే, టెస్టు సెంచరీలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2016లో హోబర్ట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో స్మృతి 109 బంతుల్లో 102 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగిన పింక్ బాల్ టెస్టులో మంధాన 216 బంతుల్లో 127 పరుగులు చేసింది.
మహిళల వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రీడాకారిణిగా కూడా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 2024లో దక్షిణాఫ్రికాపై 3 ఇన్నింగ్స్‌ల్లో 343 పరుగులు చేయడం ద్వారా స్మృతి ఈ ప్రత్యేక రికార్డు సృష్టించింది.
స్మృతి మంధాన వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీ చేసిన రికార్డు కూడా సొంతం చేసుకుంది. స్మతి మంధాన మొత్తం 7 సెంచరీలు కొట్టడం ద్వారా మాజీ ప్లేయర్ మిథాలీ రాజ్ (7 సెంచరీలు) పేరిట ఉన్న రికార్డును సమం చేసి అగ్రస్థానంలో నిలిచింది.