- Telugu News Photo Gallery Cricket photos On This Day: Former Team India Batsman Suresh Raina's Birthday on this day, stats and Records
అరంగేట్ర మ్యాచులో గోల్డెన్ డక్.. అనంతరం బెస్ట్ ఫినిషర్‌గా మారాడు.. చిన్న వయసులోనే భారత సారథిగా ఎదిగిన ‘మిస్టర్ ఐపీఎల్’ ఎవరో తెలుసా?
Suresh Raina Birthday: లక్నోలోని స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంటూ టీమ్ ఇండియాలో చేరాలని కలలుకన్నాడు. 19 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్‌లోనే గోల్టెన్ డక్ అయినా.. అనంతరం కీలక ఆటగాడిగా మారాడు.
Updated on: Nov 27, 2021 | 8:25 AM

Suresh Raina Birthday: ఈరోజు టీమిండియా మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా పుట్టినరోజు. రైనా 1986 డిసెంబర్ 27న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జన్మించాడు. రైనా ఉత్తరప్రదేశ్‌లోనే క్రికెట్ నేర్చుకుని లక్నో వెళ్లాడు. అక్కడ స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుతో పాటు తన క్రికెట్‌లోని సూక్ష్మబేధాలను అర్థం చేసుకున్నాడు. 16 సంవత్సరాల వయస్సులో, రైనా భారత అండర్ -19 టీంలో చేరాడు. ఆ తరువాత నెమ్మదిగా పైకి ఎదగడం ప్రారంభించాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేసినందుకు ప్రతిఫలంగా రైనాకు టీమిండియాలో చోటు దక్కింది. రైనా 2006లో శ్రీలంక పర్యటనలో ట్రై-సిరీస్‌లో తన వన్డే అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో జరిగిన తన అరంగేట్రం మ్యాచ్‌లో, రైనా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

మొదటి మ్యాచ్‌లో వైఫల్యం రైనాను ప్రభావితం చేయలేదు. వన్డేలు, టీ20లలో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్‌లో ముఖ్యమైన సభ్యుడిగా మారాడు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీతో కలిసి టీమిండియా మిడిల్ ఆర్డర్‌కు బలాన్ని అందించాడు. చాలా మ్యాచ్‌లలో ఫినిషర్ పాత్రను కూడా పోషించాడు. 2011లో టీమ్ ఇండియాను ప్రపంచ ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు.

ముఖ్యంగా టీ20లో అతని ఆటతీరు అద్భుతంగా ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత్ తరఫున సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2 మే 2010న టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాపై 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఒక నెల తర్వాత జూన్‌లో మొదటిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అప్పుడు రైనా వయస్సు కేవలం 23 సంవత్సరాలే కావడం విశేషం. ఈ ఫార్మాట్‌లో అతి పిన్న వయస్కుడైన భారత కెప్టెన్‌గా మారి రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రైనాను విజయాల శిఖరాలకు తీసుకెళ్లడంలో ఐపీఎల్ కీలక సహకారం అందించింది. 2008లో మొదటి సీజన్ నుంచి 2021 వరకు (2016-2017 మినహా) నిరంతరం చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్నాడు. జట్టును 4 సార్లు ఛాంపియన్‌గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా నిలిచాడు. 205 మ్యాచ్‌లలో 5528 పరుగులు చేశాడు. అందుకే రైనాను 'మిస్టర్ ఐపీఎల్' అని కూడా పిలుస్తారు.

రైనా మూడు ఫార్మాట్లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన మొదటి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రైనా తన కెరీర్‌లో 18 టెస్టులు ఆడి 768 పరుగులు చేశాడు. అదే సమయంలో వన్డేల్లో 226 మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీల సాయంతో 5615 పరుగులు చేశాడు. టీమ్ ఇండియా కోసం 78 మ్యాచ్‌ల్లో 1605 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2020 ఆగస్టు 15న ఎంఎస్ ధోనితో పాటు రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.





























