- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Shikhar Dhawan Breaks Virat Kohli's Special Record with his 99 Runs Knock against Sunrisers Hyderabad
Shikhar Dhawan: కింగ్ కోహ్లీని దాటేసిన గబ్బర్.. ఐపీఎల్ చరిత్రలో రెండో ప్లేయర్‌గా సరికొత్త రికార్డు..
హైదరాబాద్‌పై అజేయంగా 99 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో ఆ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. అసలు ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Apr 10, 2023 | 6:25 AM

IPL 2023: క్రికెట్ మైదానంలో ఒంటరి పోరాటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. IPL 2023 టోర్నీ 14వ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రదర్శన తప్పక చూడాలి. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ తరఫున.. కెప్టెన్ ధావన్ అజేయంగా 99 పరుగులతో వన్ మ్యాచ్ షో చేశాడు. ఇక టీమ్ ఓపెనర్‌గా వచ్చిన ధావన్‌కి సామ్ కర్రన్(22) మినహా మిగిలినవారి నుంచి సహాయం అందలేదు. దీంతో పంజాబ్ 9 వికెట్ల నష్టానికి 143 పరుగులే చేసింది.

అనంతరం క్రీజులోకి దిగిన హైదరాబాద్ టీమ్ ఆటగాళ్లు సునాయాసంగా తమ ఎదుట ఉన్న లక్ష్యాన్ని చేదించి విజయం కైవసం చేసుకున్నారు. ఫలితంగా గబ్బర్ చేసిన వన్ మ్యాచ్ షో వృధాగా మిగిలిపోయింది.

ఈ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు. అవును, ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన వారి జాబితాలో శిఖర్ ధావన్ 2వ స్థానానికి చేరుకున్నాడు.

అయితే అంతకముందు ఈ జాబితా రెండో స్థానంలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. ఐపీఎల్ 16వ సీజన్‌లోనే ముంబైపై అజేయంగా 82 పరుగులు చేసిన కోహ్లీ.. ఈ టోర్నీ చరిత్రలో 50వ సారి 50+ పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు చేసిన ఆటగాడిగా 2వ స్థానంలో నిలిచాడు.

కానీ ఇప్పుడు హైదరాబాద్ టీమ్‌పై శిఖర్ ధావన్ చేసిన అజేయమైన 99 పరుగుల ఇన్నింగ్స్‌తో కింగ్ కోహ్లీని అధిగమించాడు. శిఖర్ ధావన్ 208 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 51 సార్లు 50+ పరుగులను చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 49 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. తద్వారా ఆ లిస్టులో కోహ్లీని కిందకు నెట్టి రెండోస్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.

ఇక ఈ రికార్డు జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 165 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్ ఏకంగా 61 సార్లు 50+ పరుగుల మార్క్ అందుకున్నాడు.





























