- Telugu News Photo Gallery Cricket photos Indian Women's Cricketer Veda Krishnamurthy Announces Retirement from International Cricket
భారత్, ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో షాకింగ్ న్యూస్.. రిటైర్మెంట్ ప్రకటించిన 32 ఏళ్ల ప్లేయర్..
Veda Krishnamurthy Announces Retirement: వ్యక్తిగత జీవితంలోనూ వేద కృష్ణమూర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా నిలబడి, ఆట పట్ల తన నిబద్ధతను చాటుకుంది.
Updated on: Jul 25, 2025 | 9:15 PM

భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎన్నో ఏళ్లుగా సేవలందించిన స్టార్ బ్యాటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. తన 32 ఏళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు శుక్రవారం (జులై 25) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆమె ఈ నిర్ణయం భారత క్రికెట్ అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.

కర్ణాటకలోని కడూర్‌కు చెందిన వేద కృష్ణమూర్తి, చిన్నతనం నుంచే క్రికెట్‌పై అపారమైన ప్రేమను పెంచుకుంది. వీధుల్లో బ్యాట్ పట్టి ఆడిన ఆ చిన్నారి, భారత జట్టు జెర్సీ ధరించే స్థాయికి ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ, "పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చి బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో నాకు తెలియదు. కానీ, ఆటను ప్రేమించడమే మాత్రమే నాకు తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు, భారత జెర్సీ ధరించే వరకూ తీసుకెళ్తుందని నేను అస్సలు ఊహించలేదు. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ఎలా పోరాడాలో, పడిపోయినప్పుడు తిరిగి ఎలా పుంజుకోవాలో నేర్పింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా. నాకు ఎంతో ఇచ్చిన ఆటకు ఇప్పుడు నేను తిరిగిచ్చే సమయం ఆసన్నమైంది. ఈ రోజు మనస్ఫూర్తిగా క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నాను" అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది.

వేద కృష్ణమూర్తి 2011లో భారత జట్టులోకి అరంగేట్రం చేసింది. రైట్ హ్యాండ్ బ్యాటర్, అప్పుడప్పుడు లెగ్ స్పిన్ బౌలింగ్‌తో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దూకుడుగా బ్యాటింగ్ చేసే శైలితో పేరుపొందిన వేద, దాదాపు తొమ్మిదేళ్ల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆమె 48 వన్డేలు, 76 టీ20లు ఆడి మొత్తం 1,704 పరుగులు చేసింది. ఇందులో 10 అర్ధశతకాలు కూడా ఉన్నాయి. 2017 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అలాగే, 2020 టీ20 ప్రపంచ కప్‌లోనూ భారత జట్టు సభ్యురాలిగా ఉంది, ఆ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ ఆమె ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్.

2018లో చివరి వన్డే ఆడిన వేద, గత కొంతకాలంగా జాతీయ జట్టులో స్థానం దక్కించుకోలేకపోతోంది. అయితే, క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను చాటుతూ, భవిష్యత్తులో ఆటతో ఏదో ఒక రూపంలో అనుబంధాన్ని కొనసాగిస్తానని తెలిపింది. గతంలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించిన వేద, మహిళల ఐపీఎల్‌లో (డబ్ల్యూపీఎల్) గుజరాత్ జెయింట్స్ తరఫున కూడా ఆడింది. 2017-18లో మహిళల బిగ్ బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్‌కు ప్రాతినిధ్యం వహించింది.

వ్యక్తిగత జీవితంలోనూ వేద కృష్ణమూర్తి ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తన తల్లి, సోదరిని కోల్పోయి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయినప్పటికీ, ఆమె ధైర్యంగా నిలబడి, ఆట పట్ల తన నిబద్ధతను చాటుకుంది.

వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా, ఆమె భారత మహిళా క్రికెట్‌కు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె తన రెండవ ఇన్నింగ్స్‌లో కూడా విజయవంతం కావాలని ఆశిద్దాం.




