- Telugu News Photo Gallery Cricket photos Asia cup 2022 5 memorable encounters in india pakistan cricket check here full details telugu cricket news
Ind vs Pak: ఆసియా కప్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని 5 టఫ్ ఫైట్స్.. భారత్-పాకిస్థాన్ పోరంటే అట్లుంటది మరి..
ఆసియా కప్ చరిత్రలో ఇరు దేశాల మధ్య దాదాపు అన్ని మ్యాచ్‌లు చిరస్మరణీయమైనవే. అయినా కొన్ని మ్యాచ్‌లు మాత్రం ఇప్పటికీ ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నాయి.
Updated on: Aug 21, 2022 | 3:45 PM

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ మైదానంలో ఆగస్టు 28న జరిగే గ్రూప్ మ్యాచ్‌లో మరోసారి ఇరు దేశాలు తలపడనున్నాయి. ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లో భారత జట్టు పగ్గాలు రోహిత్ శర్మ చేతిలో ఉండగా, బాబర్ ఆజం పాక్ జట్టుకు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. ఆసియా కప్ చరిత్రలో ఇరు దేశాల మధ్య దాదాపు అన్ని మ్యాచ్‌లు చిరస్మరణీయమైనవే. అయినా కొన్ని మ్యాచ్‌లు మాత్రం ఇప్పటికీ ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన ఐదు అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హర్భజన్ విన్నింగ్ సిక్స్: ఈ ఆసియా కప్‌లో హర్భజన్ సింగ్, షోయబ్ అక్తర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. సల్మాన్ బట్ 74 పరుగులతో పాక్ జట్టు 267 పరుగులు చేసింది. దీంతో భారత్ మరో బంతి మిగిలి ఉండగానే విజయం సాధించింది. మహ్మద్ అమీర్ వేసిన బంతిని సిక్సర్ కొట్టి హర్భజన్ అద్భుతంగా మ్యాచ్ ముగించాడు. ఆ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ (83), ఎంఎస్ ధోని (56) కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.

కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్: 2012 ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ విరాట్ కోహ్లీకి చాలా ప్రత్యేకమైనది. మిర్పూర్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 50 ఓవర్లలో 329/6 భారీ స్కోరు చేసింది. నాసిర్ జంషెడ్ 112, మహ్మద్ హఫీజ్ 105 పరుగులు చేశారు. జవాబిచ్చిన భారత్ మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 148 బంతుల్లో 183 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరుగా నిలిచింది.

అఫ్రిది తుఫాను బ్యాటింగ్: 2014 ఆసియాకప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఇప్పటికీ అభిమానుల మదిలో మెదులుతూనే ఉంది. అయితే మిర్పూర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో పాక్ చేతిలో భారత్ ఒక్క వికెట్ తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎనిమిది వికెట్లకు 245 పరుగులు చేసింది. దీంతో జవాబిచ్చిన పాకిస్థాన్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌లో విజయం సాధించింది. షాహిద్ అఫ్రిది వరుసగా రెండు సిక్సర్లు కొట్టి తన జట్టు కోసం మ్యాచ్‌ను ముగించాడు.

అమీర్ బౌలింగ్: 2016 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య చిరస్మరణీయ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేక మొత్తం ఇన్నింగ్స్ 83 పరుగులకే కుప్పకూలింది. భారత్‌కు లక్ష్యం సులువుగా అనిపించినా మహ్మద్ అమీర్ మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌లో ఉత్కంఠ సృష్టించాడు. విరాట్ కోహ్లీ క్లిష్ట పరిస్థితుల్లో 49 పరుగులు చేశాడు. దీని కారణంగా భారత జట్టు మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకోగలిగింది.

ధావన్-రోహిత్ విజృంభణ: ఆసియా కప్ 2018లో భారత్, పాకిస్థాన్‌లు రెండుసార్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. అసలు విషయానికి వస్తే, సూపర్-4 దశలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ 78 పరుగుల సాయంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 237 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 63 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శిఖర్ ధావన్ అత్యధికంగా 114 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.
