Cockroach Milk: ఛీ.. యాక్! నిజంగా.. బొద్దింక పాలల్లో అంత మ్యాటర్ ఉందా? ఇదెక్కడి ఖర్మ..
మనం ఆవు పాలు, గేదె పాలు, గొర్రె పాలు, గాడిద పాలు గురించి విన్నాం.. కానీ మీరు ఎప్పుడైనా బొద్దింక పాలు గురించి విన్నారా? ఇది ఒక అధ్యయనం ప్రకారం ఆవు, గేదె పాలలో ఉండే పోషకాల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు వీటి పాలల్లో ఉంటాయట. పాలులాగా బయటకు వచ్చే ఈ స్ఫటికం ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇందులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. అదనంగా, ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెర కూడా ఉంటాయట..
Updated on: Feb 14, 2025 | 9:03 PM

ఆవు, గేదె పాల కంటే బొద్దింక పాలలో మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బొద్దింకలు పాలు లాంటి స్ఫటికాకార ప్రోటీన్‌ను ఉత్పత్తి చేస్తాయని, ఇందులో ఆవులు, గేదెల కంటే మూడు రెట్లు ఎక్కువ పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. పాలులాగా బయటకు వచ్చే ఈ స్ఫటికం ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. ఇందులో అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు కూడా ఉంటాయట.

100 గ్రాముల బొద్దింక పాలు తీసుకుంటే, మీకు దాని నుండి 232 కేలరీల శక్తి లభిస్తుంది. అయితే 100 గ్రాముల ఆవు పాల నుంచి 66 కేలరీల శక్తి మాత్రమే లభిస్తుంది. బొద్దింక పాలలో 45 శాతం ప్రోటీన్, 25 శాతం కార్బోహైడ్రేట్లు, 16 నుంచి 22 శాతం కొవ్వు, 5 శాతం అమైనో ఆమ్లాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ విషయాన్ని ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదించింది.

ఇందులో ఒలేయిక్ ఆమ్లం, లినోలెయిక్ ఆమ్లం, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, షార్ట్-చైన్, మీడియం-చైన్ కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇది ప్రోటీన్ మూలం. అంటే ఇందులో మొత్తం 9 అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ రోజుల్లో, చాలా మంది పాలు తాగడం లేదు. కానీ బొద్దింక పాలు మంచి ఎంపిక అని అంటున్నారు నిపుణులు. దీనికి కారణం, లాక్టోస్‌ను జీర్ణం చేసే లాక్టేజ్ ఎంజైమ్ ప్రపంచ జనాభాలో 65 శాతం మందిలో లోపంగా ఉండటమే.

అందుకే పాలు జీర్ణం కావు. బొద్దింక పాలు అలా కాదు. ఇందులో లాక్టోస్ ఉండదు. దీని కారణంగా, ఈ పాలు తాగడం వల్ల ఉబ్బరం, అజీర్ణం, వికారం, విరేచనాలు వంటి సమస్యలు రావు. అయితే, బొద్దింకలు చాలా కేలరీలను కలిగి ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయితే బొద్దింకల నుండి పాలు తీయడం అంత సులభం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ. బొద్దింకల ప్రేగులలో పాలు లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీనికోసం బొద్దింకలను చంపాలి.

100 గ్రాముల పాలు తీయడానికి దాదాపు 1000 ఆడ బొద్దింకలను చంపాలి. అయితే, నేటి సైన్స్ అభివృద్ధి చెందడంతో సమీప భవిష్యత్తులో బొద్దింక పాలే ప్రధాన పాలుగా ఉపయోగించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.





























