
ప్రభాస్‌తో పెద్ద స్పాన్ ఉన్న సినిమాలే కాదు.. పెద్ద కథలు కూడా రాసుకుంటున్నారు మన దర్శకులు. కనీసం 5 గంటల సినిమా ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్ వర్కవుట్ అవుతుంది కదా అని.. ప్రతీ సినిమాను 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే బాహుబలి 2 పార్ట్స్‌గా వచ్చింది.. కల్కి 2, సలార్ 2 సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్ సినిమాలకు తక్కువలో తక్కువ 300 నుంచి 500 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారు నిర్మాతలు.

అంత వర్కవుట్ అవ్వాలంటే 2 పార్ట్స్ ఉండాల్సిందే అంటున్నారు దర్శకులు. ప్రస్తుతం రాజా సాబ్, హను రాఘవపూడి ఫౌజీ సినిమాలను ఒకేసారి పూర్తి చేస్తున్నారు ప్రభాస్. ఇందులో రాజా సాబ్ 2 పార్ట్స్ సినిమాగా ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వరసగా సీరియస్ సినిమాలు చేస్తున్న ప్రభాస్.. మారుతితో తక్కువ బడ్జెట్‌లో సరదా సినిమా చేయాలని రాజా సాబ్ షురూ చేసారు. కానీ రానురాను ఇది కూడా భారీ బడ్జెట్ అయిపోయింది. దీనికోసం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దీనికి సైతం మారుతి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారంటూ టాక్ వినిపిస్తుందిప్పుడు.

ఆల్రెడీ కల్కి, సలార్ సీక్వెల్స్ ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు.. ముందైతే స్పిరిట్ పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రభాస్. అంతలోనే రాజా సాబ్ సీక్వెల్ కూడా అంటే కాస్త కష్టమే. అయినా ప్రతీ సినిమాను 2 పార్ట్స్‌గా చేయడమనే ఆలోచన మంచిది కాదనే వాదన కూడా వినిపిస్తుందిప్పుడు. మరి దీనిపై ప్రభాస్ దర్శక నిర్మాతలు ఏం ఆలోచిస్తారో చూడాలి.