- Telugu News Photo Gallery Business photos Telecom Act: New Telecommunications Act Implement From 26 June
Telecom Act: నేటి నుంచి అమల్లోకి వచ్చిన టెలికాం చట్టం.. ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసా?
కొత్త టెలికాం చట్టం 2023 నేటి నుండి అంటే జూన్ 26 నుండి అమల్లోకి వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, భద్రత, పబ్లిక్ ఆర్డర్ లేదా నేరాల నివారణ వంటి కారణాలతో టెలికాం సేవలను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఈ చట్టంలో కఠిన నిబంధనలను రూపొందించారు. అవేంటో తెలుసుకుందాం..
Updated on: Jun 26, 2024 | 8:02 PM

కొత్త టెలికాం చట్టం 2023 నేటి నుంచి అంటే జూన్ 26 నుంచి అమల్లోకి వస్తోంది. చట్టంలోని సెక్షన్లు 1, 2, 10 నుండి 30, 42 నుండి 44, 46, 47, 50 నుండి 58, 61, 62 వరకు నిబంధనలు కూడా నేటి నుండి అమల్లోకి వస్తాయి. కొత్త టెలికాం చట్టం ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం (1885), ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫ్ చట్టం (1933) వంటి ప్రస్తుత చట్టాలను భర్తీ చేస్తుంది.

కొత్త టెలికాం చట్టం అత్యవసర సమయంలో ఏదైనా టెలికాం సేవలు లేదా నెట్‌వర్క్‌ని నియంత్రించడానికి ప్రభుత్వాన్ని అనుమతిస్తుంది. భద్రత, పబ్లిక్ ఆర్డర్ లేదా నేరాల నివారణ కోసం ప్రభుత్వాలు టెలికమ్యూనికేషన్ సేవలపై నియంత్రణను కూడా తీసుకోవచ్చు.

ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. భద్రత, పబ్లిక్ ఆర్డర్ లేదా నేరాల నివారణ వంటి కారణాలతో టెలికాం సేవలను ప్రభుత్వం నియంత్రించవచ్చు. ఇది కాకుండా, సిమ్ కార్డులకు సంబంధించి కూడా ఈ చట్టంలో కఠినమైన నిబంధనలు చేసింది.

టెలికాం చట్టం 2023 గురించి మాట్లాడితే.. ఇది చాలా కఠినమైన నిబంధనలను కలిగి ఉంది. ఈ చట్టంలో నకిలీ సిమ్ కార్డుల జారీని నిషేధించే నిబంధన ఉంది. ఒక గుర్తింపు కార్డుపై 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే రూ.50,000 జరిమానా ఉంటుంది. మీరు అదే పనిని రెండవసారి చేస్తే, మీకు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

సిమ్‌ను విక్రయించడానికి బయోమెట్రిక్ డేటా తీసుకుంటారు. ఆ తర్వాత మాత్రమే సిమ్ జారీ అవుతుంది. ఈ బిల్లు ప్రకారం నకిలీ సిమ్ కార్డులు అమ్మినా, కొనుగోలు చేసినా, వాడినా మూడేళ్ల జైలు శిక్ష లేదా రూ.50 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఏ రకమైన సిమ్ కార్డ్ మోసానికి అయినా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

జాతీయ భద్రతా సమస్యలను పరిగణనలోకి తీసుకుంటే, టెలికాం కంపెనీలు తమ ఫోన్‌లను ప్రభుత్వం గుర్తించిన విశ్వసనీయ వనరుల నుండి మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రచార సందేశాలను పంపడానికి వినియోగదారుల ముందస్తు సమ్మతి అవసరం. టెలికాం నెట్‌వర్క్ డేటాను యాక్సెస్ చేయడం, అనుమతి లేకుండా కాల్‌లను ట్యాప్ చేయడం లేదా రికార్డ్ చేయడం కూడా నేరంగా పరిగణించబడుతుంది. దీని వల్ల 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.

టెలికాం కంపెనీలు వినియోగదారులకు DND (Do-Not-Disturb) సేవను నమోదు చేసుకోవడానికి ఒక ఎంపికను ఇవ్వాలి. తరచుగా ఇబ్బంది కలిగించే ఫోన్ కాల్‌ల గురించి కూడా వినియోగదారులు ఇప్పుడు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.




