Subhash Goud | Edited By: Anil kumar poka
Updated on: Sep 30, 2021 | 8:29 AM
Digital Payments: ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మొత్తం డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం ఉంది. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే సర్వేలో ఈ విషయం స్పష్టమైంది.
ఫోన్‌పే సర్వే ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం మంది ఫోన్‌పే యూజర్లుగా నమోదయ్యారు. తమ యాప్‌ను ఓపెన్ చేసేవారు జాతీయ సగటు కంటే తెలంగాణలో 60 శాతం అధికమని ఫోన్‌పే తెలిపింది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల ట్రెండ్స్, గణాంకాలకు సంబంధించి ఫోన్‌పే పల్స్ పేరుతో ఇంటరాక్టివ్ వెబ్‌సైట్‌ను ఇటీవల ఫోన్‌పే ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌లో వెల్లడైన ట్రెండ్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో తెలంగాణ నుంచి రూ.1,02,796 కోట్ల విలువగల 50 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. 2021 రెండో త్రైమాసికంలో తెలంగాణలో జరిగిన మొత్తం లావాదేవీల్లో హైదరాబాద్ జిల్లా 21.3 కోట్ల లావాదేవీలతో ప్రథమ స్థానంలో ఉంది.
మొత్తం డిజిటల్ లావాదేవీల్లో ఎక్కువగా 23 కోట్ల లావాదేవీలు.. కుటుంబాలు, స్నేహితులు, ఇతరులకు నగదు బదిలీ రూపంలో జరిగాయి. కిరాణా, ఆన్‌లైన్ స్టోర్లకు చెల్లింపుల రూపంలో 20.5 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి.