- Telugu News Photo Gallery Another Low Pressure In Bay Of Bengal, Heavy Rain Alert To Telugu States For 5 Days
Rain Alert: పొంచి ఉన్న మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ వార్నింగ్.. మరో 5 రోజులు కుండపోతే..
Rain Alert For AP and Telangana: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వార్నింగ్ బెల్ మోగించింది.
Updated on: Jul 22, 2023 | 10:57 AM

Rain Alert For AP and Telangana: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వార్నింగ్ బెల్ మోగించింది. దీని ప్రభావంతో దక్షిణ రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది ఐఎండీ. రాబోయే ఐదు రోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

హైదరాబాద్‌తోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. అటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. వరదలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులపాటు ఏపీలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా గోదావరి పరివాహక జిల్లాలకు వార్నింగ్ కూడా ఇచ్చింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఆంధ్రాకి అలర్ట్ మెసేజ్ పంపింది. గోదావరికి వరద ఉధృతి మరింత పెరుగుతుందని హెచ్చరించింది.

గోదావరి పరివాహక జిల్లాలకు వార్నింగ్ నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ ను అధికారులు ఇప్పటికే మోహరించారు. రాజమండ్రి, ధవళేశ్వరంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గంటగంటకూ పెరుగుతోన్న వరద ఉధృతి నేపథ్యంలో ఇవాళ మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది.

ఈరోజు వాతావరణం చూస్తే.. చాలా వరకు ఆకాశం మేఘావృతమై .. మోస్తరు వాన పడే అవకాశం కనిపిస్తోంది. అయితే బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.





























