Economic Crisis: భారత్ మరో శ్రీలంకగా మారుతుందా..! గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే..

|

Apr 26, 2022 | 6:29 PM

Economic Crisis: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో(Srilanka Crisis) ఉందంటూ గణాంకాల ఆదారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితులను, ఆర్థిక మూలాలను పరిగణలోకి తీసుకున్నప్పుడు నిపుణులు ఏమంటున్నారు. నిజంగా భారత్ మరో శ్రీలంకగా మారుతుందా గమనిద్దాం..

Economic Crisis: భారత్ మరో శ్రీలంకగా మారుతుందా..! గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే..
Economic Crisis
Follow us on

Economic Crisis: భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంక బాటలో(Srilanka Crisis) ఉందంటూ గణాంకాల ఆదారంగా అనేక మంది అంచనా వేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ధరలు, GDP రేషియోలో పెరుగుతున్న రాష్టాల అప్పులు, అధిక బడ్జెట్ లోటు, పెరుగుతున్న నిరుద్యోగిత, తక్కువ పెట్టుబడి, పడిపోతున్న డిమాండ్ వాదనలకు బలమిస్తున్న ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. పక్కనే ఉన్న లంక దేశం ఆర్థిక అస్థిరతలకు(Financial Crisis) గురైన సందర్భంలో భారత్ అప్రమత్తం కావటం సహజం. ప్రధానంగా ఏడాది కాలంలో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం.. శ్రీలంకలో మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 18.7 శాతం ఉండగా.. భారత్ లో అది 6.95 శాతంగా ఉంది. భారత్ లో ఆహార ద్రవ్యోల్బణం(Food Inflation) 2021 మార్చిలోని 4.87 శాతం నుంచి 7.68 శాతానికి పెరిగింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో డబుల్ కంటే ఎక్కువగానే పెరిగింది. 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం భారత జీడీపీలో అప్పుల నిష్పత్తి 90.50 శాతంగా ఉంది. ఇది శ్రీలంక విషయంలో 119 శాతాన్ని దాటేసింది.

భారత ఆర్థిక వ్యవస్థ శ్రీలంక పరిస్థితులకు చేరుకోవటం లేదని, కనీసం 1991 నాటి సంక్షోభ పరిస్థితులను కూడా ఎదుర్కోవటం లేదని మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు విదేశీ మారక నిల్వలు, కరెంట్ ఖాతాలోటుపై అధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు. దీని ప్రకారం భారత్ వద్ద 600 బిలియన్ డాలర్ల ఫారెక్స్ నిల్వలు ఏడాది దిగుమతుల చెల్లింపులకు సరిపోతాయని వివరించారు. ఇదే సమయంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 2.7 శాతంగా ఉందని అన్నారు. ఇది పెరుగుతున్న విదేశీ వాణిజ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అంటున్నారు. ఈ లెక్కన గణాంకాలను చూస్తే ప్రస్తుతం పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోనే ఉన్నాయని వెల్లడించారు. మరో పక్క బడ్జెట్ లోటు, ఆర్థిక లోటు భారం, కరోనా కేసుల సంఖ్య పెరిగితే వచ్చే అవాంతరాలు వంటి వాటిని కూడా గమనించాలని అంటున్నారు.

ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్న కారణంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది చివరి నాటికి వడ్డీ రేట్లను రెండితలు చేయాలని యోచిస్తోంది. 2023 చివరికి రేట్లను 2.75 శాతానికి చేర్చాలని భావిస్తోంది. కరోనా సందర్భంగా అప్పట్లో ఈ రేటు సున్నాగా ఉంది. అమెరికా, యూరప్ తో పాటు ఇతర దేశాల్లో వడ్డీ రేట్లు పెరిగితే విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(FII)లు తమ పెట్టుబడులను అక్కడికి తరలించే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగానే స్టాక్ మార్కెట్లు పతనం అవుతుండగా.. రూపాయి తన విలువ క్షీణిస్తోంది. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా అమెరికా ఫెడ్ బాటలోనే రేట్లను పెంచనుంది. ఫిబ్రవరిలో జరిగిన ద్రవ్య పరపతి సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ తన వడ్డీ రేట్లలో మార్పులు తీసుకురాలేదు. మరో పక్క రష్యా యుద్ధం కారణంగా ఐఎంఎఫ్ భారత వృద్ధి అంచనాలను 8.20 శాతం నుంచి 8 శాతానికి తగ్గించింది. కొంత ప్రమాదం ఉన్నప్పటికీ పరిస్థితులు అదుపు తప్పలేదు. ఇలాంటి సమయంలో తప్పు జరిగితే పరిణామాలు ఊహించని విధంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోదీ హయాంలో ఇలాంటి తప్పు జరగదని భారత్ భావిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ గణాంకాలు ప్రమాదకరంగా ఉన్నప్పటికీ.. బలమైన మూలాధారాలు దేశాన్ని శ్రీలంక మార్గంలో జారిపోనివ్వవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Solar Hotel: విశాఖలో ఔరా అనిపిస్తున్న సోలార్ హోటల్.. దీని ప్రత్యేకతలేమిటంటే..

Nitin Gadkari: టెస్లాకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆహ్వానం.. కానీ ఆ విషయంలో మాత్రం కండిషన్స్ అప్లై..