SRILANKAN PRESIDENT: కొత్త లంకేశ్వరుని ముందు పెనుసవాళ్ళు.. అధ్యక్షహోదా ముళ్ళకిరీటమే.. అధిగమించే దారేది?
కొత్త అధ్యక్షుడు వస్తే మాత్రం ఆ దేశంలో ఇప్పటికిప్పుడు పరిస్థితి మారిపోతుందా ? లంకేశ్వరుని పాత్రలోకి కొత్త వ్యక్తి వచ్చినంత మాత్రాన తీవ్రమైన ద్రవ్యోల్పణం నుంచి లంకేయులకు విముక్తి లభిస్తుందా ? పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్ళపై ఓ విశ్లేషణ.
SRILANKAN PRESIDENT RANIL VIKRAMASINGHE TO FACE MANY MORE CHALLENGES: కొత్త లంకేశ్వరుడొచ్చాడు.. ఆయన రాకతో సంక్షోభం సమసిపోతుందా ? కనీసం లంకేయుల్లో నెలకొన్న ఆందోళన అయినా చల్లారుతుందా ? జులై 20న రణిల్ విక్రమసింఘే శ్రీలంకకు కొత్త అధ్యక్షుడిగా పార్లమెంటు ద్వారా ఎన్నిక అయిన మరుక్షణం మొదలైన సందేహాలివి. 2009లో బీజం పడి.. 2022లో అంతమైన రాజపక్స (RAJAPAKSA) కుటుంబీకుల పాలనలో కునారిల్లిపోయిన దేశాన్ని రణిల్ విక్రమసింఘే గాడిలో పెట్టగలడా ? ఒకవేళ గాడిలో పెట్టగల సామర్థ్యం రణిల్‌కు వున్నా ఆదేశంలో, ఆ దేశం బయట నెలకొన్న పరిస్థితి రణిల్‌కు సహకరిస్తుందా ? ఒకవేళ సహకరించినా అంతర్జాతీయ సమాజం (INTERNATIONAL COMMUNITY) దయాభిక్ష పెట్టకపోతే దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం.. తద్వారా భారీ ధరాఘాతాన్ని ఉపశమింపజేయడం కొత్త లంకేశ్వరునికి సాధ్యమవుతుందా ? శ్రీలంక సంక్షోభాన్ని దగ్గర నుంచి పరిశీలించిన వారికి రణిల్ విక్రమ సింఘే దేశాధ్యక్షుని హోదాను నెత్తిన ముళ్ళ కిరీటంతోను.. సీటు కింద రావణకాష్టంతోను నెట్టుకు రావాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. ఒకదానికొకటి ముడిపడి వున్న చిక్కులను విప్పడం.. పరిస్థితిని చక్కదిద్దడం రణిల్‌కు కష్టసాధ్యమని కూడా చెప్పలేని పరిస్థితి. తప్పనిసరి పరిస్థితిలో అసాధ్యమన్న పదాన్నే వాడక తప్పని స్థితి. నాలుగైదు నెలలుగా దేశంలో కొనసాగుతున్న ప్రజాందోళన జులై తొలివారం నుంచి మరింత తీవ్రరూపాన్ని సంతరించుకుంది. జులై 9వ తేదీన పెల్లుబికిన ప్రజాందోళనకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ (PRESIDENTIAL PALACE) వేదికైంది. దాంతో అప్పటి వరకు అధ్యక్ష పీఠాన్ని పట్టుకుని వేలాడుతున్న గొటబయ రాజపక్స (GOTABAYA RAJAPAKSA) తొలుత రహస్య ప్రదేశానికి షిఫ్ట్ అయ్యి.. ఆ తర్వాత బతుకు జీవుడా అంటూ మాల్దీవుల (MALDIEVES) గుండా సౌదీ అరేబియా (SAUDI ARABIA)కు చేరిపోయిన పరిస్థితి. దేశం దాటే దాకా ప్రెసిడెంటు పోస్టుకున్న ప్రివెలేజెస్‌ని వ్యూహాత్మకంగా వాడుకున్న గొటబయ.. ఇపుడు తాను దశాబ్దకాలానికిపై ఆర్జించిన అవినీతి సొమ్ముతో విదేశాలలో జల్సా చేస్తూ వుండొచ్చు గాక.. కానీ ఆ దేశంలో తిండికి మొహం వాచిన ప్రతీ పౌరుడు పెడుతున్న శాపనార్థాల తాకిడిని మాత్రం తట్టుకోలేడు. తాజాగా జులై 20న జరిగిన ఎన్నికలో లంకేశ్వరునిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘేకు కూడా గొటబయ రాజపక్స ప్రాపకం అంటుకుంది. పార్లమెంటులో తమ పార్టీకి ఒక్క సభ్యుడు కూడా లేని రణిల్ విక్రమసింఘే ఏకంగా 134 ఓట్లను ఎలా సాధించగలిగాడు? అది కచ్చితంగా గొటబయ రాజపక్స చలవేనన్నది ఇపుడు సగటు లంకేయుని కామెంట్. మరి గొటబయ ప్రాపకంతో అధ్యక్షుడైన రణిల్ విక్రమసింఘే ఇపుడు ఏం చేయగలడు ? ఇది తాజాగా అధ్యక్ష ఎన్నిక ముగిసి ఫలితం వెలువడిన తర్వాత ఆందోళనకారులు లేవనెత్తుతున్న ప్రశ్న. వెరసి అధ్యక్ష ఎన్నిక ప్రహసనం ముగిసినా కొత్త అధ్యక్షునికి సవాళ్ళ మీద సవాళ్ళే ఎదురయ్యే సంకేతాలు సుస్పష్టం.
శ్రీలంక సంక్షోభానికి (SRILANKA CRISIS) తెరపడేదెన్నడు? ఈ ప్రశ్నకిపుడు సూటిగా జవాబు చెప్పే శక్తిసామర్థ్యాలున్న వ్యక్తి బహుశా ప్రపంచంలో ఎవ్వరూ లేరేమో. ఆర్థిక సంక్షోభానికి రాజకీయ సుస్థిరత తోడై దానికి భారీ విదేశీ రుణం రూపంలో పొంచివున్న అతిపెద్ద ప్రమాదం కలగలిస్తే ప్రస్తుతం ద్వీప దేశంలో కొనసాగుతున్న సంకట పరిస్థితి అని చెప్పాలి. లంకేయుల ఆందోళన హింసాత్మకమవుతున్న తరుణంలో అక్కడ రాజకీయ సుస్థిరత ఇప్పట్లో సాధ్యమా అన్న సందేహం కలుగుతోంది. అదేసమయంలో జులై 20వ తేదీన ఎన్నికయిన శ్రీలంక కొత్త అధ్యక్షునికి పరిస్థితి చక్కదిద్దేందుకు ఏ మేరకు అవకాశాలున్నాయనేది కూడా చర్చనీయాంశమే. 2009లో ఎల్టీటీఈ (LTTE)ని అంతమొందించిన తర్వాత విజయగర్వంతో తమకు ఎదురే లేదన్న రీతిలో రెచ్చిపోయిన రాజపక్స కుటుంబీకులు.. దేశాన్ని అధోగతిలోకి నెట్టారు. తొలుత మహేంద రాజపక్స (MAHINDA RAJAPAKSA) రెండు విడతలుగా.. ఆ తర్వాత గొటబయ రాజపక్స మూడున్నరేళ్ళుగా విచ్చలవిడిగా పాలించారు. తమకు ఎదురే లేదన్న రీతిలో ఏకపక్ష నిర్ణయాలతో దేశాన్ని అధోగతి పాల్జేశారు. అవినీతికి అసమర్థ, అనాలోచిత విధానాలు తోడై శ్రీలంకను అధ: పాతాళానికి చేర్చాయి. విదేశీ రుణంలోంచి సింహభాగం రాజపక్స కుటుంబీకుల అకౌంట్లకు మళ్ళిందన్న ఆరోపణలున్నాయి. ఈ అకౌంట్లు దేశీయ బ్యాంకుల్లో కాకుండా విదేశీ బ్యాంకుల్లో వుండడం, ఇపుడు గొటబయ సహా ఆయన కుటుంబీకులు పలువురు విదేశాలకు పారిపోవడం చూస్తే విదేశీ రుణ మొత్తాలను రాజపక్స కుటుంబీకులు వృధా చేశారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో రణిల్ విక్రమ సింఘేకు మునుముందు నిద్రలేని రాత్రులే అని చెప్పక తప్పదు. జులై 13వ తేదీన గొటబయ దేశం దాటి పోవడంతో రణిల్ విక్రమ సింఘే ఆపద్ధర్మ అధ్యక్షుడయ్యాడు. అదేసమయంలో ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సహా పలు అధికారిక భవనాలను ఆక్రమించుకున్న ఆందోళన కారులు.. తామాక్రమించిన భవనాలను ఖాళీ చేస్తామని ప్రకటించాయి. కానీ ఆందోళన కారులు ఒకరి సారథ్యంలో నడవ లేదు కాబట్టి.. ఆ హామీ ఇచ్చిందెవరో కానీ ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుని ఎన్నిక బాధ్యత పార్లమెంటు ముందుకొచ్చింది. బరిలో ముగ్గురు నిల్వగా రణిల్ విక్రమ సింఘే అసాధారణ రీతిలో 134 మంది సమర్థించగా.. కొత్త అధ్యక్షడయ్యాడు.
రణిల్ విక్రమసింఘే ఎన్నిక గొటబయతో ముందు కుదిరిన ఒప్పందంలో భాగమేనని ఇపుడు లంకేయులు భావిస్తున్నారు. గొటబయకు దేశం దాటేలా రణిల్ సహకారమందించడం.. ఆ తర్వాత గొటబయ పార్టీ ఎంపీలు రణిల్‌కు అనుకూలంగా పార్లమెంటులో ఓట్లు వేయడం.. ఇది వారిద్దరి మధ్య కుదిరిన ఒప్పందమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. జులై 9న అధ్యక్ష భవనం నుంచి పారిపోయిన రహస్య ప్రదేశంలో తలదాచుకున్న గొటబయ నాలుగు రోజుల తర్వాత అంటే జులై 13న మాల్దీవులకు పారిపోయాడు. అక్కడ్నించి సింగపూర్ మీదుగా సౌదీ అరేబియా చేరుకున్నట్లు కథనాలు వచ్చినా ఇప్పటికీ గొటబయ ఎక్కడ వున్నారన్నది సీక్రెట్ గానే వుంది. గొటబయ ఎక్కడున్నారన్నది పక్కన పెడితే.. ఇపుడు రణిల్ విక్రమసింఘే తన ముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఆయన ఎన్నికపై ఆందోళనకారులు సంతృప్తిగా లేరు. అలాంటి తరుణంలో ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఏ మేరకు ఉపసంహరిస్తారన్నది ప్రశ్నార్థకమే. ఓవైపు ఉద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతుంటే.. ఇంకోవైపు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం రణిల్‌కు ఏ మాత్రం సాధ్యం కాదు. మరోవైపు ఆయన ఎన్నికను వ్యతిరేకిస్తున్న పార్టీలు ఆందోళనకారులను రెచ్చగొట్టే అవకాశాలే ఎక్కువ. ఆందోళన తీవ్రతను తగ్గించుకోవడం.. కేబినెట్ సహచరులను కూర్చుకోవడం.. ఆ తర్వాత విదేశాల సాయాన్ని, మరీ ముఖ్యంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి (INTERNATIONAL MONETARY FUND – IMF) అధికారులను ఒప్పించి 51 బిలియన్ల అమెరికన్ డాలర్ల రుణంపై బెయిల్ అవుట్ తెచ్చుకోవడం.. ఈ అతిపెద్ద టాస్క్‌ను రణిల్ ఏమేరకు పూర్తి చేయగలడన్నదిపుడు మిలియల్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరల తగ్గించడమే ప్రజాగ్రహాన్ని తగ్గిస్తుంది. అందుకోసం ముందుగా శ్రీలంకకు భారీగా విదేశీ సాయం కావాలి. దశాబ్దకాలంపై శ్రీలంకను వాడుకున్న డ్రాగన్ కంట్రీ చైనా ఇపుడు ఈ ద్వీపదేశం వైపు డయాగ్నల్‌గా కూడా చూడడం లేదు. అగ్రరాజ్యాలు కూడా శ్రీలంక విషయంలో సానుభూతి చూపిస్తున్నాయి కానీ ఆర్థిక సాయానికి ముందుకు రావడం లేదు. భారత్ ఎంతో కొంత సాయం చేసినా అది శ్రీలంకలో నెలకొన్న భారీ సంక్షోభాన్ని నివారించలేదు. ఇలాంటి కీలక తరుణంలో రణిల్ విక్రమసింఘే లంకేశ్వరునిగా పదవీబాధ్యతలు చేపట్టినా ఇప్పటికిప్పుడు ఆ దేశానికి, ఆ దేశప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది నిర్వివాదాంశం.