India: గేమ్ ఛేంజర్‌గా మారనున్న పర్యాటక రంగం.. 5 కోట్ల ఉద్యోగాలు, రూ.20 లక్షల కోట్ల ఆదాయం!
మనిషికి బోర్ కొడితే.. పొరుగూరిలో దేవాలయానికో.. సిటీలో సినిమాకో చాలామంది వెళతారు. రెండు మూడు రోజులు సెలవులు దొరికితే చాలు.. అలా ఓ టూరేసుకొస్తారు. కొంతమంది సెలవు పెట్టి మరీ.. ప్రకృతి అందాలు చూడడానికి దేశ పర్యటన చేస్తారు. మనిషి జీవితంలో టూరిజానికి ఉన్న ప్రాధాన్యత ఇది. కేవలం వీరివల్లే దేశంలో ఐదు కోట్ల మంది ఉద్యోగాలు పొందితే ఎలా ఉంటుంది? కేవలం ఇలాంటి వారి వల్లే 2027కి మన దేశ పర్యాటక మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లు అవుతుందంటే మీరు నమ్మగలరా! రండి అలా పర్యాటక రంగం గురించి చదువుతూనే టూరిజంతో భారత్ గ్రాఫ్ ఎలా పెరగబోతోందో.. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే గేమ్ ఛేంజర్ ఎలా అవ్వబోతోందో తెలుసుకుందాం.
మన దేశంలో ఒక్క రంగం అభివృద్ధి చెందితే.. 5 కోట్ల ఉద్యోగాలు. అబ్బా! చదవడానికి ఎంత బాగుందో కదా. అవును. కేవలం చదవడానికే కాదు.. చెప్పడానికి, వినడానికి, చూడడానికి ఈ నెంబర్ చాలా బాగుంటుంది. అన్ని కోట్ల ఉద్యోగాలను ఇచ్చే రంగం ఏమిటి అని అనుకోవచ్చు. అదే.. పర్యాటక రంగం. కేవలం టూరిజమ్ సెక్టార్ ని డెవలప్ చేస్తే ఇన్ని కోట్ల ఉద్యోగాలా అని చాలామంది అనుకోవచ్చు. కానీ దేశాలకు దేశాలు కేవలం ఈ రంగాన్ని నమ్ముకునే జీవనం గడిపేస్తున్నాయి. అలాంటిది మన దేశం పాలిట కచ్చితంగా ఇది గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు.
కేవలం పర్యాటకులపై ఆధారపడి ఆర్ధికవ్యవస్ధను నడిపించుకుంటున్న దేశాలెన్నో. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ సంగతి చూద్దాం. ఆ దేశాన్ని పర్యటించే ప్రతి వంద మంది పర్యాటకుల వల్ల సగటున 944 ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అంటే ఒక్క పర్యాటకుడి వల్ల దాదాపుగా 9 ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ లెక్కన ఇండియాకు ఇంకెన్ని అవకాశాలున్నాయో ఊహించండి. ఇన్నాళ్లు భారతదేశం పెద్దగా ఫోకస్ చేయని ఒక అతిపెద్ద ఆర్థిక వనరు. పర్యాటక రంగాన్ని ఎందుకు ప్రోత్సహించాలో ఇండియా తెలుసుకుంటోంది. ఆ ప్రణాళికలను ఆచరణలో పెడుతోంది. అందుకే ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పవచ్చు.
2023లో భారత్ హెల్త్ టూరిజం మార్కెట్ 6.79 బిలియన్ డాలర్లు
ఈమధ్య ప్రధాని మోదీ లక్షద్వీప్‌ను ఎందుకు సందర్శించారో, అందులోని లక్ష్యమేంటో అందరికీ తెలుసు. కేవలం మాల్దీవుల ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి కాదు. పర్యాటకులు లక్షద్వీప్ లాంటి టూరిజమ్ ప్రాంతాలకు వెళ్తే ఇండియా ఇంకెంత అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి. ఆల్రెడీ దేశ పర్యాటక రంగాన్ని బీజేపీ ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోందనే చెప్పాలి. ఏ లెక్కన ఇలా చెబుతున్నారన్న ప్రశ్న రావచ్చు. దీనికి ఓ ఉదాహరణ చూద్దాం. 2019లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మహాబలిపురం సందర్శించారు. ఆ విషయం చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆ తరువాత నుంచి మహాబలిపురంలో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. 2021-22లో మహాబలిపురం ప్రాంతాన్ని చూడ్డానికి వచ్చిన విదేశీయులు 1 లక్ష 40వేల మంది. ఆ ఏడాది దేశంలో విదేశీయులను ఆకర్షించిన భారత పర్యాటక ప్రాంతాల్లో నెంబర్ వన్‌గా ఉన్నది మహాబలిపురమే. అంతకు ముందు మహాబలిపురం వెళ్లిన విదేశీయులు కేవలం వందల్లో మాత్రమే ఉండేవారు. ఇక అదే 2021లో ఇండియాకు వచ్చిన టూరిస్టులు దాదాపు 15 లక్షలు. పర్యాటకం అంటే కేవలం అందమైన ప్రదేశాలు చూడ్డానికే అనుకుంటారు చాలా మంది. కాని, వైద్యం, విద్య, వ్యాపార అవసరాలు, విశ్రాంతి తీసుకోడానికి వచ్చే వారిని కూడా పర్యాటకులు అనే అంటారు. హెల్త్ టూరిజంలో ఇండియా.. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉంది. 2023లో దేశ హెల్త్ టూరిజం మార్కెట్ 6.79 బిలియన్ డాలర్లు.
ఆమధ్య మోదీ లక్షద్వీప్ కు వెళ్లడానికి కారణం ఒక్కటే. మనవాళ్లు విదేశాలకు వెళ్లడం కాదు.. ముందుగా మనదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను వాళ్లు వెళ్లేలా చేయడమే టార్గెట్. ఇక్కడ మరో విషయం కూడా స్పష్టం చేయాలి. పర్యాటక రంగం అనగానే విదేశాల నుంచే వస్తారు, వాళ్లనే పర్యాటకులు అంటారు అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి పక్కనున్న ఊటీ, కొడైకెనాల్ వెళ్లినా అదీ పర్యాటకమే, వాళ్లూ పర్యాటకులే. సో, మనవాళ్లు దేశం దాటి వెళ్లడం కంటే వాళ్లని ఇండియాలోనే తిప్పాలనేది ప్రభుత్వం ప్లాన్.
కొన్ని గణాంకాల ప్రకారం ఇండియా నుంచి విదేశాలు చూడ్డానికి వెళ్లిన భారతీయులు 2001లో 45 లక్షల 60వేలు ఉంటే.. 2019 నాటికి 2 కోట్ల 69 లక్ష 20వేల మంది విదేశాలను సందర్శించారు. అంటే ఎన్ని వేల కోట్ల ఆదాయం మనదేశం నుంచి ఆయా దేశాలకు వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. సో, ఆ ఆదాయాన్ని ఇండియాకే వచ్చేలా చేయాలనుకుంటోంది మోదీ ప్రభుత్వం. అందుకే, లక్షద్వీప్‌లో స్నార్కెలింగ్, గుజరాత్ పంచకుయ్ బీచ్‌లో స్కూబా డైవింగ్ చేశారు ప్రధాని మోదీ. ఇక విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో వస్తే మహా సంతోషం. వారి వల్ల డాలర్స్ వస్తాయి. ఇది రూపాయి విలువ బలపడడానికి ఉపయోగపడుతుంది.
2028 నాటికి దాదాపు 3 కోట్ల మంది విదేశీ పర్యాటకులు భారత్ కు వస్తారని అంచనా
1997లో ఇండియాకు 23 లక్షల 74 వేల 094 మంది విదేశీ పర్యాటకుల ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం కేవలం 10వేల 511 కోట్లు. 2019 వచ్చే నాటికి ఒక కోటి 90వేల మంది వచ్చారు. వీరి ద్వారా వచ్చిన విదేశీ మారక ద్రవ్యం అక్షరాలా 2 లక్షల 11వేల కోట్లు. 2028 నాటికి 30.5 మిలియన్ల మంది, అంటే 3 కోట్ల మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశ పర్యటనకు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఎన్ని లక్షల కోట్ల మారకద్రవ్యం ఇండియా ఖాతాలో పడుతుందో ఓ అంచనా వేయొచ్చు. పైగా ప్రపంచంలో అత్యంత సుందరమైన దేశాలలో ఇండియాకు 7వ స్థానం లభించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రచురించిన దాని ప్రకారం.. ది 50 మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ సర్వేలో పర్యాటకులు ఇండియాకు 7వ స్థానం ఇచ్చారు. ఈ లెక్కన ప్రపంచ పర్యాటకంలో ఇండియా అద్భుతాలే సృష్టించబోతోందని అర్థం.
కరోనా కారణంగా, ఆ తరువాత వచ్చిన ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాల కారణంగా పర్యాటకరంగం దెబ్బతిన్నది గానీ.. 2018 వరకు బ్రహ్మాండంగా కొనసాగింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ పర్యాటకరంగ సంస్థ లెక్కల ప్రకారం వరల్డ్ జీడీపీలో 5 శాతం కేవలం పర్యాటక రంగం నుంచే వస్తోంది. ఈ టూరిజమ్ సెక్టారే 2018లో భారత్‌లో ఏకంగా నాలుగున్నర కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. పర్యాటకరంగంపైనే ఆధారపడే దేశాల జీడీపీలో 10 శాతం కేవలం పర్యాటకుల ద్వారానే ఆర్జిస్తున్నాయి.
2022లో కశ్మీర్ ను సందర్శించినవారు కోటి 88 లక్షలు
వచ్చే ఐదేళ్లలో స్విట్జర్లాండ్‌ను మరిపించేలా కశ్మీర్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు ప్రధాని మోదీ. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతం పర్యాటకంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 2021లో ఒక కోటి 13 లక్షల మంది కశ్మీర్ సందర్శిస్తే.. 2022లో ఆ సంఖ్య కోటి 88 లక్షలకు పెరిగింది. స్విట్జర్లాండ్‌ను ఏడాదికి 4 కోట్ల 40 లక్షల మంది సందర్శిస్తుంటారు. ప్రస్తుతం కశ్మీర్ ఏకంగా ఏడాదికి 2 కోట్ల మందిని ఆకర్షిస్తోంది. ప్రధాని మోదీ చెప్పినట్టు వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఖాయం. ఇక విదేశీయులు కూడా కశ్మీర్‌కు భారీగా వస్తున్నారు. 2022లో 4వేల మంది విదేశీయులు వస్తే.. ఇప్పుడు 18వేలకు పైగా ఫారెనర్స్ కశ్మీర్‌లో అడుగుపెట్టారు. ఇది గత రికార్డులను కూడా చెరిపేస్తోంది. ఇదంతా జీ20 సమావేశాన్ని కశ్మీర్‌లో ఏర్పాటు చేయడం ద్వారానే సాధ్యమైంది.
2027 నాటికి భారత పర్యాటక మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లు!
ఒక్క కశ్మీర్ అనే కాదు.. దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే.. ఈ ఒక్క రంగమే కొన్ని కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించగలదు. 2030 నాటికి, అంటే వచ్చే ఐదారేళ్లలో 2.5 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని స్వయంగా భారత ప్రభుత్వమే అంచనా వేస్తోంది. అంతేకాదు, ఈ పర్యాటక రంగంతో 2030 నాటికి 20 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని కూడా చెబుతోంది. 2022 నాటికే భారత ఆర్థిక వ్యవస్థకు 15.7 లక్షల కోట్ల రూపాయలు వచ్చింది. పర్యాటకరంగంపై పక్కా ప్రణాళికలతో వెళ్తున్న కేంద్ర ప్రభుత్వం.. గత 9 సంవత్సరాలలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం 30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఇక వచ్చే 25 ఏళ్ల కోసం భారత ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 2047 నాటికి వీక్షిత్ భారత్ విజన్ సాధించేలా పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇండియా తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఇండియాలో ట్రావెల్ మార్కెట్ కూడా పెరుగుతోంది. 2027 నాటికి ఈ మార్కెట్ విలువ 125 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఆధ్యాత్మిక పర్యాటకం వల్ల 2022లో రూ.కోటి 30 లక్షల కోట్ల ఆదాయం
అయోధ్యలో రామమందిరం నిర్మాణం… దేశీయ పర్యాటక రంగానికి ఓ ఊపు తెచ్చేదే. ఇండియా టెంపుల్ టూరిజం విలువ వెలకట్టలేనిది. భారతీయులు సరదాకు ఏ బీచ్‌కో, కశ్మీర్ కొండలకో వెళ్లడం అరుదేమో గానీ, గుళ్లుగోపురాలకు మాత్రం అదో అలవాటుగా వెళ్లిపోతుంటారు. నిజానికి ఇది అతిపెద్ద మార్కెట్ కూడా. కేంద్ర పర్యాటక శాఖ సమాచారం ప్రకారం ఇండియాలో టెంపుల్ టూరిజం.. ఓవరాల్ టూరిజంలో 60 శాతానికిపైగానే ఉంటుంది. అంటే, వందలో 40 మంది విశ్రాంతి, వినోదం కోసం పర్యటనకు వెళ్తుందటే.. 60 మంది కేవలం గుళ్లు గోపురాలకే వెళ్తున్నారు. అలాగని ఈ మార్కెట్‌ను తక్కువ చేయడానికి వీల్లేదు. భారతదేశంలో ఉన్న ఆలయాలు, వాటిని సందర్శించడానికి వెళ్లే భక్తులు లేదా పర్యాటకుల కారణంగా 2022లో దేశ ఆర్ధిక వ్యవస్థకు కోటి 30 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2021లో ఇది 65వేల కోట్ల రూపాయలుగానే ఉండేది. ఇప్పుడు అయోధ్య రామమందిరం పూర్తవడం, కాశీ కారిడార్ ఏర్పాటు చేయడంతో టెంపుల్ టూరిజం విలువ ఊహించనంతగా పెరగబోతోంది.
ఏ రంగం అయినా అభివృద్ధి చెందాలంటే.. మారుతున్న కాలంతో పాటు.. అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. మన దేశంలో పర్యాటక రంగం కూడా అదే ప్రయత్నంలో ఉంది. టూరిస్టులకు అల్టిమేట్ గా మధురమైన అనుభూతిని మిగిల్చే ప్రయత్నం చేస్తోంది. దీనికోసం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యాటకుల వ్యక్తిగత అవసరాలు, ప్రాధాన్యతలకు ఇంపార్టెన్స్ ఇచ్చేలా, గ్రేట్ ఎక్స్ పీరియన్స్ సొంతం చేసుకునేలా.. బిగ్ డేటా అనలటిక్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి టెక్నాలజీని ఉపయోగిస్తోంది. పర్యాటక రంగంలోని సాంకేజిక పరిజ్ఞానంలో వచ్చిన ఈ మార్పు.. కేవలం కస్టమర్ ఎక్స్ పీరియన్స్ ని ఫీల్ గుడ్ గా మార్చడమే కాకుండా.. ట్రావెల్ ఇండస్ట్రీ రూట్ నే మార్చేయబోతోంది. యూజర్ ఎక్స్ పీరియన్స్, సర్వీస్ డెలివరీ, కస్టమర్ ఎంగేజ్ మెంట్, కొత్త బెంచ్ మార్కుల సెట్టింగ్ లో సరికొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో బిగ్ డేటా అనలటిక్స్.. కార్యాచరణ సామర్థ్యం, మార్కెట్ విశ్లేషణ, వ్యూహాత్మక ప్రణాళికలను కలిగి ఉంటుంది. విస్తారంగా ఉండే డేటాను ప్రాసెస్ చేయగల, విశ్లేషించగల సామర్థ్యాన్ని.. కంపెనీలను అర్థం చేసుకోవడానికి, వినియోగదారులకు వినూత్న ఉత్పత్తులను అందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కస్టమర్లకు విభిన్నమైన ఆఫర్ లను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వారిని ఎక్కువుగా ఆకర్షిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ను ఇస్తుంది.
ఏదేమైనా ట్రావెల్ మార్కెట్, టూరిజం మార్కెట్ వృద్ధి చెందితే.. కనీసం 5 కోట్ల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి.
మరిన్ని ప్రీమియం వార్తల కోసం క్లిక్ చేయండి..