UP Elections 2022: యూపీలో మళ్లీ పాత నినాదాన్నే నమ్ముకున్న కమల దళం.. ఆ వ్యూహంతో ముందుకు

'ఉత్తరప్రదేశ్‌లో ఉండాలంటే యోగి ఆదిత్యనాథ్‌కు జై కొట్టాల్సిందే. సీఎం యోగికి ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే.. యోగికి ఓటు వేయకుంటే జేసీబీ..

UP Elections 2022: యూపీలో మళ్లీ పాత నినాదాన్నే నమ్ముకున్న కమల దళం.. ఆ వ్యూహంతో ముందుకు
Njp
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 16, 2022 | 2:25 PM

‘ఉత్తరప్రదేశ్‌లో ఉండాలంటే యోగి ఆదిత్యనాథ్‌కు జై కొట్టాల్సిందే. సీఎం యోగికి ఓటేయనివారు రాష్ట్రం వదిలి వెళ్లిపోవాల్సిందే.. యోగికి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత యోగికి ఓటు వేయని వారిని గుర్తిస్తాం’. ఇది మన గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరిక.. ఇక్కడితో ఆగారా? ఇప్పటికే వేల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు యోగి తెచ్చి పెట్టారట! దేనికి? యోగికి ఓటేయకపోతే వాటితో దాడి చేయడానికి..! ఇలాంటి బెదిరింపులు చేసిన ప్రజాప్రతినిధిని ఇప్పటివరకు మనం చూసి ఉండం! సరే.. ఈ హెచ్చిరికపై దేశవ్యాప్తంగా ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయనుకోండి.. దీన్ని పక్కన పెడితే.. రెండు విడితల పోలింగ్‌ ముగిసిన తర్వాత రాజాసింగ్‌ ఇలాంటి బెదిరింపులకు ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? ఎక్కడో తేడా కొడుతున్నదన్న సంకేతాలు వచ్చి ఉంటాయా? యూపీలో మా విజయం నల్లేరు మీద నడక అని మొన్నటి వరకు చెప్పుకున్న బీజేపీ నాయకుల్లో ఈ ఆకస్మిక మార్పుకు కారణం ఏమిటి? ఎందుకు తమ వ్యూహాన్ని మార్చేసి మళ్లీ హిందుత్వ ఎజెండాను తెర ముందుకు తీసుకొచ్చింది? అంటే యూపీలో తమ విజయం అనుకున్నంత తేలిక కాదని బీజేపీ గ్రహించి ఉంటుంది. మొన్నటి వరకు అభివృద్ధి నినాదంతో ర్యాలీలు, సమావేశాలు నిర్వహించిన బీజేపీ ఇప్పుడు హిందుత్వ జపం చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ రాక ముందు ఉత్తరప్రదేశ్‌లో అనేక అభివృద్ధి పనులను చేపట్టింది యోగి ప్రభుత్వం. అలాగే ప్రధాని నరేంద్రమోదీని ప్రత్యేకంగా పిలిపించుకుని అనేక శంకుస్థాపనలు చేయించింది. ప్రారంభోత్సవాలను జరిపించింది. ఈ అభివృద్ధి నినాదాం అంతగా వర్క్‌అవుటవ్వడం లేదని తెలుసుకున్న బీజేపీ ఇప్పుడు రూటు మార్చింది. హిందుత్వ ఎజెండాను ఎత్తుకుంది.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటి వరకు రెండు విడతల పోలింగ్‌ సజావుగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాతంగా ముగిసాయి. మొత్తం 113 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ స్థానాలన్ని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ వీటిలో 91 సీట్లను కైవసం చేసుకుంది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. జరిగిన రెండు విడతల్లో దాదాపుగా 70 శాతం వరకు పోలింగ్‌ నమోదయ్యింది. అంటే ముస్లింలు భారీగా తరలివచ్చి ఓటేశారని అనుకోవాలి. క్రితం సారి సంగతేమిటో కానీ ఇప్పుడు మాత్రం ముస్లింలు సమాజ్‌వాదీ పార్టీ వెంట ఉన్నారు. మొన్న బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేశారో యూపీలోనూ అదే ఎత్తుగడనే వేశారు. మజ్లిస్‌తో పాటు ఇతర లౌకికవాద పార్టీలకు ఓటు వేస్తే అది బీజేపీకే లాభిస్తుందనే విషయాన్ని గ్రహించారు. తమ ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడ్డారు. బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎలాగైతే ఓటు వేశారో ఇక్కడా అలాగే సమాజ్‌వాదీ పార్టీకి ఓటేశారని విశ్లేషకులు చెబుతున్నారు.

భారతీయ జనతా పార్టీ పెద్దలకు విషయం తెలిసిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు గతాన్ని తవ్వే పనిలో పడ్డారు. 2013లో ఇదే పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో జాట్లు-ముస్లింలకు మధ్య గొడవలు జరిగాయి. ఈ సంఘటనలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. ముస్లింల వేధింపులకు జడిసి కైరానా నుంచి హిందూ కుటుంబాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ సంఘటనలను 2017 ఎన్నికల్లో బీజేపీ బాగా వాడుకుంది. ప్రతీ ఎన్నికల సభలోనూ ముజఫర్‌నగర్‌ అల్లర్లను ప్రస్తావించింది. ఈ అంశం ఆ ఎన్నికల్లో బాగా ప్రభావం చూపింది. 403 అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీ సింగిల్‌గా 312 సీట్లు గెల్చుకోగలిగిదంటే ఇదే కారణం. ఈసారి హిందుత్వ కార్డు అంతగా పని చేయదని బీజేపీ ఏనాడో గ్రహించింది. అందుకే ఎన్నికలకు ఆరు నెలల ముందునుంచే అభివృద్ధి ఎజెండాను ఎత్తుకుంది. సుమారు లక్ష కోట్లకు పైగా విలువైన పనులకు శంకుస్థాపనలు చేసింది. రహదారులు, ఎయిర్‌పోర్టులు, విశ్వ విద్యాలయాలు, ఎరువుల కార్మాగారాలు ఇలా ప్రతీదానికి పునాది రాళ్లు వేసింది. లాస్టియర్‌ అక్టోబర్‌ నుంచి మొదలు పెడితే ఈ ఏడాది జనవరి మొదటి వారం వరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 16 పెద్ద ర్యాలీలలో పాల్గొన్నారు. ఇవన్నీ పరోక్షంగా ఎన్నికల ర్యాలీలే! అదలా ఉంచితే గత మూడు నెలల కాలంలో మోదీ, అమిత్‌షా, యోగిలు ప్రతి మూడు అసెంబ్లీ స్థానాలకు గాను రెండింటిలో ర్యాలీనో రోడ్‌షోనో నిర్వహించారు. మొత్తం 403 సీట్లలో దాదాపు 68 శాతం స్థానాలను వీరు కవర్‌ చేశారు. అంటే 275 నియోజకవర్గాలలో ప్రచారం నిర్వహించారు. 75 జిల్లాలలో 47 జిల్లాల్లో 112 సభలు, ర్యాలీలను నిర్వహించింది బీజేపీ. అందులో మోదీ 16, అమిత్‌ షా 20, యోగి ఆదిత్యనాథ్‌ 76 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

యూపీలో మొదట విడత పోలింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీదే పైచేయిగా కనిపించిందని అంటున్నారు. ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపించిందని చెబుతున్నారు. పోలింగ్‌ శాతం అనుకున్నదానికంటే తక్కువగా నమోదు కావడం తమకు లాభించే అంశమని బీజేపీ చెప్పుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడా కనిపించలేదని అంటోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన రైతులు పోలింగ్‌ కేంద్రాలకు పెద్దగా రాలేదని కమలంపార్టీ వివరిస్తోంది. రెండో విడత పోలింగ్‌లోనూ 60.44 శాతం ఓటింగ్‌ మాత్రమే నమోదయ్యింది. ఈ లెక్క ప్రభుత్వ వ్యతిరేకత ఏంతుందో, అనుకూలత కూడా అంతే ఉందని అర్థమవుతోంది. ఏ పార్టీకి అదనంగా రెండు నుంచి మూడు శాతం ఓట్లు పడతాయో ఆ పార్టీ గెలిచే ఛాన్సుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇలాగైతే లాభం లేదనుకున్న బీజేపీ మరోసారి హిందుత్వను తెరమీదకు తీసుకొచ్చింది. తాము అధికారంలోకి వస్తే మథురలో ఆలయం కడతామంటూ చెబుతోంది. సమాజ్‌వాదీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం అబ్బాజాన్‌ అనే వారికే రేషన్‌ అయినా ప్రభుత్వ పథకాలైనా అందేవని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ అందుతున్నాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికలను 80-20 మధ్య జరుగుతున్న పోరుగా యోగి అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం హిందువులు, 20 శాతం ముస్లింలు ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకునే యోగి ఈ వ్యాఖ్యలు చేశారనేది అందరికీ తెలిసిన విషయమే! ప్రధానమంత్రి మోదీ కూడా ఉత్తరాఖండ్‌ ప్రచారంలో దేవభూమి అయిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోందని అన్నారు. ఇలా హిందువుల ఓట్లను సంఘటితం చేసే పనిలో పడ్డారు. అభివృద్ధి మంత్రం అంతగా పనిచేయడం లేదన్న విషయం బీజేపీ అధినాయకత్వానికి తెలిసింది. అందుకే హిందుత్వ నినాదాన్ని ఎత్తుకుంది. మరి ఈ నినాదం బీజేపీని విజయతీరాలకు చేరుస్తుందా లేదా అన్నది మార్చి 10న తేలుతుంది.