No-Confidence Motion: అత్యధికంగా ఇందిరపై అవిశ్వాసాలు.. మోదీపై ఇది రెండోది.. ఒక్కసారి నెగ్గని అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానంపై మాట్లాడే ఎంపీలు.. అన్ని రకాల అంశాలను ప్రస్తావించవచ్చు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో లోక్‌సభ సమావేశాలు రసవత్తరంగా మారడం మాత్రం ఖాయం.

No-Confidence Motion: అత్యధికంగా ఇందిరపై అవిశ్వాసాలు.. మోదీపై ఇది రెండోది.. ఒక్కసారి నెగ్గని అవిశ్వాస తీర్మానం
No Confidence Motion
Follow us

|

Updated on: Jul 28, 2023 | 7:03 PM

మణిపూర్ అంశం ఇపుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది. అధికార, విపక్ష కూటమి మధ్య మణిపూర్ అంశం నిప్పు రాజేస్తోంది. మే 3వ తేదీన మణిపూర్‌లో ఉన్నట్లుండి హింస ప్రజ్వరిల్లగా దాదాపు రెండున్నర నెలలు వెయిట్ చేసిన కాంగ్రెస్ సహా బీజేపీ ప్రత్యర్థి పార్టీలిపుడు పార్లమెంటు వేదికగా విజృంభిస్తున్నాయి. మణిపూర్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా స్పందించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. మోదీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంటులోను, సోషల్ మీడియాలోను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం వైఫల్యం వల్లే మణిపూర్ రగులుతుందన్నది విపక్షాల ఆరోపణల సారాంశం. జులై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. ప్రతీ రోజుల సమావేశాలు విపక్షాలు అడ్డుకుంటూనే వున్నాయి. చర్చకు సిద్దమని అధికార పక్షం చెబుతున్నా.. తాను సూచించిన సెక్షన్ల కిందే మణిపూర్ అంశాన్ని చర్చించాలని పట్టుబడుతున్నాయి. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకుంటూనే వున్నాయి. పార్లమెంటు వెలుపల మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేసినా విపక్షాలు మాత్రం నెమ్మదించడం లేదు. దరిమిలా పార్లమెంటు ఒక్క రోజు కూడా నార్మల్‌గా భేటీ కాలేదు. ప్రతిష్టంబన కొనసాగుతున్న నేపథ్యంలోనే విపక్షాలు వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాయి. మోదీ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించాయి. అనుకున్నదే తడవుగా అవిశ్వసాన్ని ప్రతిపాదించాయి. అయితే, ఇపుడు బంతి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కోర్టులో వుంది. విపక్షాలిచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది స్పీకర్ నిర్ణయించాలి. ఆయన ఓ ప్రకటన చేసిన తర్వాత లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలవుతుంది. అయితే, అవిశ్వాస తీర్మానంపై మాట్లాడే ఎంపీలు.. అన్ని రకాల అంశాలను ప్రస్తావించవచ్చు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సందర్భంలో లోక్‌సభ సమావేశాలు రసవత్తరంగా మారడం మాత్రం ఖాయం.

అత్యధిక అవిశ్వాసాలు ఇందిరపైనే

ఇక దేశంలో అవిశ్వాస తీర్మానాల ప్రస్తావన ఇపుడు జోరందుకుంది. స్వాతంత్ర భారత చరిత్రలో లోక్‌సభలో ఇప్పటిదాకా 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. అయితే వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెగ్గలేదు. వాటి కారణంగా ఒక్కసారి కూడా కేంద్రంలో ప్రభుత్వం దిగిపోవాల్సిన పరిస్థితి రాలేదు. అయితే ప్రభుత్వమే కోరి తెచ్చుకునే విశ్వాస పరీక్షల్లో మాత్రం కనీసం మూడుసార్లు ప్రభుత్వాలు పడిపోయినట్టు తెలుస్తోంది. సుదీర్ఘ కాలం ప్రధానిగా కొనసాగిన ఇందిరా గాంధీ ప్రభుత్వంపై అత్యధికంగా ఏకంగా 15 సార్లు అవిశ్వాస తీర్మానాల ప్రతిపాదన జరిగింది. ఇందిరా గాంధీపై మొట్టమొదటి అవిశ్వాస తీర్మానాన్ని 1966లో ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే కమ్యూనిస్టు దిగ్గజం హీరేంద్రనాథ్‌ ముఖర్జీ ప్రవేశపెట్టారు. కేవలం 61 మంది ఎంపీలే ముఖర్జీ అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. 270 మంది ఎంపీలు దానిని వ్యతిరేకించారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే అదే సంవత్సరం 1966లోనే ఇందిరపై రెండో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకొచ్చింది. ఆ తర్వాత 1967, 1968, 1969, 1970, 1973, 1974, 1975 సంవత్సరాలలో కూడా ఇందిరపై అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదనకొచ్చాయి. కాగా వీటిలో 1968, 1974, 1975 సంవత్సరాలలో రెండేసి మార్లు అవిశ్వాస ఆయుధాన్ని ప్రయోగించాయి ఆనాటి విపక్షాలు. మళ్ళీ 1976, 1978, 1981, 1982ల్లో ఇందిర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఇందులో 1976లో ఇందిరా గాంధీ ప్రభుత్వంపై బీజేపీ దిగ్గజ నేత, మాజీ ప్రధాని, ఆనాటి జనసంఘ్‌ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రవేశపెట్టారు. వాజ్ పేయి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏకంగా 162 మంది ఎంపీలు మద్దతిచ్చారు కూడా. దేశచరిత్రలో విపక్షాలు ప్రతిపాదించిన ఓ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా వచ్చిన అత్యధిక ఓట్లు ఇవే కావడం విశేషం. 257 మంది వాజ్ పేయి తీర్మానాన్ని వ్యతిరేకంచడంతో అవిశ్వాసం వీగిపోయింది. అయితే 1975 నాటి ఎమర్జెన్సీని దేశంలో చాలా పార్టీలు వ్యతిరేకించడం వల్లనే 1976లో వాజ్ పేయి ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఎంపీలు ఓటేశారు.

మోదీపై ఇది రెండోది

స్వాతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం 1963లో లోక్‌సభ ముందుకొచ్చింది. ఆనాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకు వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ కాంగ్రెస్‌కే చెందిన ఆచార్య కృపలానీ దీన్ని ప్రవేశపెట్టడం విశేషం. 1962లో చైనాతో యుద్ధంలో ఓటమి పాలైన వెంటనే కృపలానీ నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని ప్రతిపాదించారు. దీనిపై సభలో 4 రోజుల పాటు 20 గంటలకు పైగా చర్చ జరిగింది. కేవలం 62 మంది ఎంపీలు మాత్రమే కృపలానీ తీర్మానాన్ని సమర్థించారు. 347 మంది వ్యతిరేకించడంతో చివరికి తీర్మానం వీగిపోయింది. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వంపై 1964లో ఎన్‌సీ ఛటర్జీ, 1965లో ఎస్‌.ఎన్‌.ద్వివేది, స్వతంత్ర పార్టీ ఎంపీ ఎం.ఆర్‌.మసానీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 1979లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ రాజీనామాకు దారితీసింది. తీర్మానంపై ఓటింగ్‌ జరగక చర్చ అసంపూర్తిగా మిగిలిపోయిన సందర్భంలో మొరార్జీ స్వచ్ఛందంగా రాజీనామా నిర్ణయం తీసుకోవడం విశేషం. 2003లో ఏబీ వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్ష నేత హోదాలో నాటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అవిశ్వాస తీర్మానం పెట్టారు. కేవలం 189 మంది ఎంపీలు మద్దతివ్వగా, 314 మంది వ్యతిరేకించారు. దాంతో 21 గంటల చర్చ అనంతరం అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. 2018 మోదీ సర్కారుపై టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దానికి 135 మంది ఎంపీలు మద్దతివ్వగా 330 మంది వ్యతిరేకించారు. కాగా ఏకైక తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు అయిదేళ్ళ పాలనలో మూడుసార్లు అవిశ్వాసాన్ని ఎదుర్కొన్నారు. తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు ప్రభుత్వం మూడుసార్లు అవిశ్వాస తీర్మానాలు ఎదుర్కొని విజేతగా నిలిచింది. తొలిసారి 1992లో బీజేపీ ఎంపీ జశ్వంత్‌సింగ్‌ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై అధికార, విపక్షాలపై లోక్‌సభ వేదికగా నువ్వా నేనా అన్నట్టుగా వాగ్వాదాం జరిగింది. ఏకంగా 225 మంది ఎంపీలు తీర్మానానికి మద్దతిచ్చారు. 271 మంది వ్యతిరేకించడంతో తీర్మానం వీగిపోయి పీవీ సర్కారు ఊపిరి పీల్చుకుంది. 1992లోనే పీవీ ప్రభుత్వంపై వాజ్‌పేయీ, 1993లో అజయ్‌ ముఖోపాధ్యాయ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక రాజీవ్‌ గాంధీ ప్రభుత్వంపై తెలుగు ఎంపీ మాధవరెడ్డి 1987లో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన ప్రవేశపెట్టిన తీర్మానం లోక్‌సభలొ మూజువాణి ఓటుతో వీగిపోయింది.