Two Headed Cobra: అప్పుడప్పుడు పట్టణాలు, గ్రామాల్లోకి అడవి జంతువులు రావటం సర్వసాధారణం అయిపోయింది. కొన్ని చోట్ల పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగు బంట్లు వంటి క్రూరమృగాలు వచ్చి ఆగమాగం చేస్తున్నాయి. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో మయూరాలు చేరి వయ్యారంగా నాట్యం చేసిన దృశ్యాలు కూడా మనం చూశాం. అయితే అక్కడక్కడ మాత్రం అరుదైన సర్పాలు కూడా దర్శనమిస్తున్నాయి.
తాజాగా ఉత్తరాఖండ్‌లో రెండు తలల కోబ్రా అందరికి దర్శనమిచ్చింది. వికాస్‌నగర్‌లోని ఓ కర్మాగారం పరిధిలో ఇది కనిపించింది. ఒకటిన్నర అడుగుల పొడవున్న ఈ పాము రెండు వారాల పాముగా గుర్తించారు. అయితే పాము జన్యుపరమైన లోపంతో అలా పుట్టిందో లేదా ఇంకేదైనా సమస్యా తెలుసుకుంటామని అటవీ అధికారులు తెలిపారు. వివిధ కారణాల వల్ల పాములు ఎక్కువగా స్మగ్లింగ్‌కి గురవుతున్న సంగతి తెలిసిందే. అటవీ అధికారులు ఈ అరుదైన పాముని పట్టుకొని వెళ్లారు.
సాధారణంగా పాము అంటే ఒక తల ఉంటుంది.. అలాగే రెండు తలల పాము అంటే ముందు ఒక తల, వెనుకొక తల ఉంటుంది. కానీ ఈ పాముకి తల ప్రాంతంలోనే రెండు తలలు ఉన్నాయి. ఈ పాము చాలా విషపూరితమైనది. రెండు తలలు ఉండడంతో దీనికి నాలుగు కళ్లు, రెండు నాలుకలు ఉన్నాయి. శరీరం ఒకటే అయినా రెండు తలలు వేరు వేరుగా పనిచేస్తున్నాయి. ఆహారం కోసం ఈ రెండు తలలు వేర్వేరుగా వెతుకులాట మొదలుపెడుతాయని అటవీ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు.. పర్యావరణానికి మేలు చేసే రెండు తలల పాములను కొంతమంది దుండగులు అక్రమ రవాణా చేస్తున్నారు. రెడ్ శాండ్ గోవా పేరుతో పిలిచే రెండు తలల పాముల్ని అన్వేషిస్తున్నారు. ఈ పాములను అమ్మే ప్రయత్నంలో చాలామంది పోలీసులకు చిక్కిన సందర్భాలున్నాయి. అయితే విషరహితంగా ఉండే ఈ పాములు పొలాల్లో ఎలుకలను తింటూ పంటలను రక్షిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. ఇవి ఇంట్లో ఉంటే కలసి వస్తుందనే మూఢనమ్మకంతో కొంతమంది వీటిని అధిక ధరలు చెల్లించి కొంటున్నారని సమాచారం.