న్యూఢిల్లీ, మే 1: ప్రముఖ యూట్యూబర్ ధృవ్ రాతీ తెలియని వారుండరు. వినూత్న వీడియోలు చేస్తూ అనతి కాలంలోనే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ధృవ్ రాతీకి సంబంధించిన ఓ వ్యార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధృవ్ ఓ పాకిస్థానీ యువతిని వివాహం చేసుకున్నాడని, అతని భార్య పాకిస్థాన్ పౌరురాలని గత కొంత కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ధృవ్ అసలు పేరు బద్రుద్దీన్ రషీద్ లాహోరీ అని, అతని భార్య జూలీ.. పాకిస్తాన్ పౌరురాలు జులైఖా అని తెలుపుతూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కరాచీలోని అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బంగ్లాలో పాకిస్థాన్ మిలటరీ రక్షణలో ఈ దంపతులు నివసిస్తున్నారని కూడా సదరు పోస్టులో పేర్కొన్నారు. తన గురించి, తన భార్య గురించి సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ధృవ్ రాతీ మంగళవారం (ఏప్రిల్ 30) సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు.
‘నేను తీసిన వీడియోలలో నేను లేవనెత్తిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదు. కాబట్టే వారు ఈ ఫేక్ న్యూస్‌లను నాపై క్రియేట్ చేసి, ప్రచారం చేస్తున్నారు. నా భార్య కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యారు. దిగజారిన ఐటీ సెల్ ఉద్యోగులు నైతిక ప్రమాణాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు’ అని యూట్యూబర్ ధృవ్ రాథీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అంతేకాకుండా తాను నూటికి నూరుపాళ్లు భారతీయుడినని, తన భార్య వందకు వంద శాతం జర్మన్ దేశస్తురాలని క్లారిటీ ఇచ్చాడు. తనపై పెట్టిన ఫేక్ పోస్టులను కూడా దీనిని జత చేశాడు.
They have no answer to the videos I made so they’re spreading these fake claims.
And how desperate do you have to be to drag my wife’s family into this? You can also see the disgusting moral standard of these IT Cell employees. pic.twitter.com/sqWj8vaJaY
— Dhruv Rathee (@dhruv_rathee) April 29, 2024
కాగా యూట్యూబర్ ధృవ్ రాథీకి 18 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతను తరచూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీడియోలు పోస్టు చేస్తూ ఉంటాడు. ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలను ఎత్తి చూపుతూ సర్కార్‌ను ప్రశ్నిస్తుంటాడు. ఇతని వీడియోలకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అనతి కాలంలోనే ధృవ్ పేరు యూట్యూబ్‌లో మారుమ్రోగి పోయింది. తాజాగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ధృవ్ రాతీని లక్ష్యంగా చేసుకుని ఇటీవల అనేక ఫేక్ పోస్ట్‌లు సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ చేశారు. ఇక యూట్యూబర్ ధృవ్ తాజా పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నీ దారిలో నువ్వు ముందుకు సాగిపో.. నిన్ను ధ్వేషించే వాళ్లు మరిన్ని కారణాలను వెతుక్కుంటారు. డోంట్ వర్రీ బ్రో.. మీ వీడియోలు అప్‌లోడ్ చేయండి’ అంటూ పలువురు కామెంట్ సెక్షన్‌లో ధృవ్‌ను సపోర్ట్ చేస్తున్నారు.
ధ్రువ్ రాతీ 2013లో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించగా ఇప్పటి వరకూ 19 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు అతని యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 600కు పైగా వీడియోలను ధృవ్ పోస్ట్ చేశాడు. హర్యానాలో పుట్టి పెరిగిన ధృవ్ రాతీ జర్మనీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జూలీ ఎల్‌బిఆర్-రతీని వివాహం చేసుకున్నాడు. ధృవ్, అతని భార్య జంటగా చేసే సాహస యాత్రలకు సంబంధించి ఓ ప్రత్యేక వ్లాగ్‌ను నడుపుతున్నారు. ట్రావెల్ వ్లాగర్ నుంచి పొలిటికల్ ‘ఇన్‌ఫ్లుయెన్సర్’గా అతను అనతి కాలంలోనే బాగా ఫేమస్ అయ్యాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.