Viral: ఎయిర్‌పోర్ట్‌లో NIA అధికారిణిని అంటూ మహిళ బిల్డప్.. లగేజ్ చెక్ చేయగా ఊహించని ట్విస్ట్
దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ పేరును వాడుకుని డ్రగ్స్ స్మగ్లింగ్‌కు తెరలేపిన ఓ మహిళ... అంతే నాటకీయంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడింది. నిందితురాలి తెలివికి కస్టమ్స్ అధికారులే షాక్ అయ్యారు! . పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

ఢిల్లీ భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టురట్టయ్యింది. 11.35 కిలోల మత్తు పదార్థాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించిన మహిళా ప్రయాణికురాలిని అరెస్టు చేశారు. థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ఓ మహిళా ప్రయాణికురాలిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. ఆమె కదలికలపై నిఘా ఉంచిన అధికారులు, ఆమె అనుమానాస్పదంగా విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌కు వెళ్లడాన్ని గమనించారు. వాష్‌రూమ్ నుంచి బయటికి వచ్చే సమయంలో ఆమె రూపమే మారిపోయింది! సామాన్య ప్రయాణికురాలిలా కాకుండా, జాతీయ చిహ్నంతోపాటు NIA ముద్రించిన జాకెట్‌ను ధరించి వచ్చింది. తనను ఎవరూ తనిఖీ చేయకుండా, నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా తప్పించుకోవాలని చూసింది. గ్రీన్ ఛానల్ దాటుతుండగా…. అధికారులు ఆమెను అడ్డగించారు. ఆమె బ్యాగ్‌ను స్కానింగ్ చేయగా, అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. ఆమె తనను ఎన్ఐఏ అధికారిణిగా పరిచయం చేసుకుని, బ్యాగ్‌ను తెరవడానికి నిరాకరించింది.
ఆమె చూపిన గుర్తింపు కార్డు నకిలీదని గుర్తించిన అధికారులు… బ్యాగ్ తనిఖీ చేసి షాక్ అయ్యారు. ప్యాక్ చేసి ఉన్న 20 కవర్లలో 11.35 కిలో గ్రాములు డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. డ్రగ్స్‌ను దాచిన సంచులపై కూడా ఎన్ఐఏ లోగో, జాతీయ చిహ్నం ఉన్నట్లు గుర్తించారు. దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ పేరును అడ్డం పెట్టుకుని అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు చేసిన ఈ భారీ కుట్రను కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. నిందితురాలిని ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్టు చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.




