దేవేంద్ర ఫడ్నవీస్ కే మళ్ళీ మహారాష్ట్ర పగ్గాలు ?
మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య రేగిన సిగపట్లు ఓ కొలిక్కి వచ్చినట్టే ! ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా మళ్ళీ ఎన్నికయ్యారు. సౌత్ ముంబైలోని విధాన భవన్ లో జరిగిన సమావేశంలో ఈ పార్టీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలూ హాజరై ఆయనను శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడిన ఫడ్నవీస్.. తనపట్ల అంతా విశ్వాసం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శివసేనతో కలిసి తాము […]
మహారాష్ట్రలో అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య రేగిన సిగపట్లు ఓ కొలిక్కి వచ్చినట్టే ! ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా మళ్ళీ ఎన్నికయ్యారు. సౌత్ ముంబైలోని విధాన భవన్ లో జరిగిన సమావేశంలో ఈ పార్టీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలూ హాజరై ఆయనను శాసన సభా పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం మాట్లాడిన ఫడ్నవీస్.. తనపట్ల అంతా విశ్వాసం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో శివసేనతో కలిసి తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ తీర్పు బీజేపీ-శివసేన కూటమికి ఇచ్చిన తీర్పు.. త్వరలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం ఈ కూటమిదే.. వదంతులను నమ్మకండి అని ఆయన ట్వీట్ చేశారు. 50:50 ప్రాతిపదికన తమకు అధికార వాటా పంచాలని శివసేన డిమాండు చేస్తున్న సంగతి విదితమే. లోక్ సభ ఎన్నికలకు ముందు తనకు, అమిత్ షా కు, ఫడ్నవీస్ కు మధ్య ఈ మేరకు ఓ ఫార్ములా కుదిరిందని సేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే గతంలోనే పేర్కొన్నారు. అయితే తమ పార్టీ ఈ విధమైన హామీనేదీ ఇవ్వలేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. కాగా-శివసేన లేనిదే ప్రమాణ స్వీకారం జరగదని ఫడ్నవీస్ సహచరుడైన బీజేపీ సీనియర్ నేత గిరీష్ మహాజన్ తెలిపారు. మేం కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారాయన. ఏమైనా.. చూడబోతే శివసేన డిప్యూటీ సీఎంతోనే సరిపెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తెర వెనుక ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ పార్టీ కాస్త మెత్తబడింది. శివసేన ఎమ్మెల్యేలు గురువారం తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై తమ శాసన సభా పక్ష నేతను ఎన్నుకోనున్నారు.