రఘురాం రాజన్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన RBI మాజీ గవర్నర్
రఘురాం రాజన్.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌గా కీలక పాత్ర పోషించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు.

Raghuram Rajan: రఘురాం రాజన్.. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌గా కీలక పాత్ర పోషించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ సర్కారు తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యమయ్యారు. ఇటీవల ఆయన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడవడం అందరి దృష్టిని ఆకర్షించింది. రఘురాం రాజన్‌కు రాజకీయాల పట్ల మక్కువ ఉందన్న చర్చకు మొదలయ్యింది. త్వరలోనే రాజన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని.. మరో మన్మోహన్ సింగ్ కాబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. పీవీ హయాంలో ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి దేశ ఆర్థిక మంత్రిగా.. ప్రధానిగా సేవలందించడం తెలిసిందే. మన్మోహన్ సింగ్ బాటలోనే రఘురాం రాజన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని హస్తిన రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా జోరుగానే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో త్వరలో తాను రాజకీయాల్లోకి వనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో రఘురాం రాజన్ స్పందించారు.రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనడం దేశ పౌరుడిగా తన స్పందన మాత్రమేనని పేర్కొన్నారు. అయితే దీని వెనుక రాజకీయ ఉద్దేశాలేవీ లేవని ఆయన స్పష్టంచేశారు.
‘ప్రజాస్వామ్యం మన గొప్ప బలం అని నేను నమ్ముతున్నాను. మత సామరస్యం మన గొప్ప బలం అని నేను నమ్ముతున్నాను. చర్చ మన గొప్ప బలమని నేను నమ్ముతున్నాను. ఇవన్నీ ఇప్పుడు ముప్పులో ఉన్నాయని నేను నమ్ముతున్నాను. అందుకే ఒక పౌరుడిగా, మన వ్యవస్థలను బలోపేతం చేద్దామనేవారి గళాన్ని బలపరచాలని నేను అనుకున్నాను. ఈ మార్గంలో దేశం ముందుకు వెళ్తే దేశం పురోగతి సాధిస్తుంది..దేశ పౌరులందరూ ప్రశాంతంగా జీవించలరు.. వీటిని ఆకాంక్షిస్తూ ఒక పౌరుడిగా కొంత దూరం నడిచాను’ అని రాజన్ వ్యాఖ్యానించారు.




ఇప్పుడు దేశంలో ‘అంతర్గత సామరస్యం’ ఎంతో అవసరమని రాజన్ పేర్కొన్నారు. దేశంలో అసమానతలపై స్పందించిన రాజన్.. పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే పోటీతత్వం ఉండాలి తప్ప.. గుత్తాధిపత్యం ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మరిన్ని రాజకీయ వార్తలు చదవండి..




