చండీగఢ్, సెప్టెంబర్ 28: కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం (సెప్టెంబర్ 28) అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్‌లో ఎమ్మెల్యే ప్రమేయం ఉన్నట్లు బయటపడటంతో ఈ మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు తెల్లవారు జామున జరగిని సెర్చ్ ఆపరేషన్‌లో పంజాబ్ పోలీసుల బృందం జలాలాబాద్‌లోని ఫజిల్కాలో ఖైరా నివాసానికి చేరుకుని ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.
2015లో నమోదైన పాత డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ దాడి నిర్వహించారు. ఈ కేసులో భోలాత్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నిందితుడిగా తేలడంతో గురువారం ఉదయం చండీగఢ్‌లోని ఆయన నివాసంలో పోలీసులు దాడి చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద గతంలో నమోదైన కేసులో భాగంలో జలాలాబాద్ పోలీసులు ఈ ఉదయం ఎమ్మెల్యే నివాసంలో సోదాలు జరిపారు. అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉండటం, వారికి ఆశ్రయం కల్పించడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందడం వంటివి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దర్యాప్తు సంస్థ ఛార్జ్ షీట్ ప్రకారం.. ఈ విధంగా ఆర్జించిన నిధులను ఆస్తుల కొనుగోలుకు ఉపయోగించినట్లు తెలుస్తోంది. 2014 నుంచి 2020 మధ్య కాలంలో ఖైరా ప్రకటించిన ఆదాయానికి మించిన ఖర్చు చూపడంతో పోలీసుల నిఘా అతనిపై పడింది. దాదాపు రూ.6.5 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది.
VIDEO | Congress leader @SukhpalKhaira arrested by Jalalabad Police from his house in Chandigarh earlier today.
(Source: Third Party) pic.twitter.com/tfxhjckvQI
— Press Trust of India (@PTI_News) September 28, 2023
పోలీసుల తనిఖీల సమయంలో ఎమ్మెల్యే ఖైరా ఫేస్‌బుక్‌లో లైవ్‌లో ఉన్నారు. ఈ వీడియోలో తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఖైరా పోలీసులతో వాగ్వాదానికి దిగడం కనిపించింది. అరెస్ట్‌కు సంబంధించి వారెంట్ చూపించాలని కూడా అడగటం వీడియోలో కనిపిస్తుంది. అనంతరం పాత డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఖైరాకు పోలీసు అధికారి డీఎస్పీ అచ్రు రామ్ శర్మ చెప్పడం వీడియోలో కనిపిస్తుంది. వీడియోలో ఎమ్మెల్యే ఖైరా ‘పంజాబ్ సర్కార్ ముర్దాబాద్ ‘అంటూ నినాదాలు చేస్తుండగా పోలీసు సిబ్బంది అతన్ని నిర్బంధించి స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌ను అతని కుటుంబ సభ్యులు అడ్డుకోగా బలవంతంగా పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించారు. అనంతరం జలాలాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్ట్ ఆప్, కాంగ్రెస్‌ల సంబంధాలను దెబ్బతీస్తుందని పలువురు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. పంజాబ్‌లో ఆప్‌తో పొత్తు, సీట్ల పంపకాలను కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.