AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ‘నిద్రపోతుందా సర్కార్?..’ అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన బిడ్డలను భుజాలపై మోస్తూ 15 కి.మీ.ల నడక

ఏ తల్లిదండ్రులకు ఇంతటి దుస్థితి రాకూడదు.. విష జ్వరాల బారీన పడి ఇద్దరు బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారే మరణించారు. కళ్ల ఎదుటే ఇద్దరు బిడ్డలు కన్నుమూయడంతో కన్నపేగు విలవిలలాడింది. చేసేదిలేక.. బిడ్డల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్దామంటే అంబులెన్స్‌ అందుబాటులో లేదు. దీంతో పుట్టెడు దుఃఖంతో ప్రాణంలేని పసివాళ్ల మృతదేహాలను భుజాన వేసుకుని అడుగుకొక్క కన్నీటి బొట్టుచొప్పున..

Watch Video: 'నిద్రపోతుందా సర్కార్?..' అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన బిడ్డలను భుజాలపై మోస్తూ 15 కి.మీ.ల నడక
Parents Forced To Walk 15 Km With Their Children's Bodies
Srilakshmi C
|

Updated on: Sep 05, 2024 | 7:15 PM

Share

ముంబై, సెప్టెంబర్‌ 5: ఏ తల్లిదండ్రులకు ఇంతటి దుస్థితి రాకూడదు.. విష జ్వరాల బారీన పడి ఇద్దరు బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక్కసారే మరణించారు. కళ్ల ఎదుటే ఇద్దరు బిడ్డలు కన్నుమూయడంతో కన్నపేగు విలవిలలాడింది. చేసేదిలేక.. బిడ్డల మృతదేహాలను ఇంటికి తీసుకెళ్దామంటే అంబులెన్స్‌ అందుబాటులో లేదు. దీంతో పుట్టెడు దుఃఖంతో ప్రాణంలేని పసివాళ్ల మృతదేహాలను భుజాన వేసుకుని అడుగుకొక్క కన్నీటి బొట్టుచొప్పున ఏక ధాటిగా ఏడుస్తూ ఊరు చేరారు. ఈ హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని పట్టిగావ్ గ్రామంలో సెప్టెంబర్‌ 4వ తేదీన చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా పట్టిగావ్‌ గ్రామానికి చెందిన దంపతులకు 6, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఇటీవల విష జ్వరాలు వచ్చాయి. తమ గ్రామంలో సరైన వైద్య సదుపాయంలేకపోవడంతో స్థానికంగా ఉన్న పూజారి వద్దకు తీసుకెళ్లారు. అతడు ఏవో మూలికలు ఇవ్వడంతో పరిస్థితి మరింత క్షీణించింది. అనంతరం జిమ్లగట్టలోని సమీప ఆరోగ్య కేంద్రంలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఇద్దరు పిల్లలు ఒకేసారి ఆసుపత్రిలోనే బుధవారం మరణించారు. అయితే ఆస్పత్రిలో అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో గత్యంతరంలేక.. తల్లిదండ్రులు ఇద్దరూ బిడ్డల మృతదేహాలను భుజాలపై వేసుకుని వర్షంలో తడిసిన బురద మార్గంలో సుమారు 15 కిలోమీటర్లు నడిచి స్వగ్రామానికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి ఘటనలు గడ్జిరోలి జిల్లాలో సర్వసాధారనం. భామ్రాగడ్, ఎటపల్లి, అహేరి తహసీల్‌లలోని మారుమూల గ్రామాలలో నిత్యం ఇలాంటి విషాద ఘటనలు లెక్కకు మించి జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కొరత ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. చాలా గ్రామాలకు సరైన రోడ్లు కూడా లేవు. ఇక వైద్యులు, అంబులెన్స్ సేవలు అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఇలా నిస్సహాయంగా విలపించడం తప్ప వారికి మరోదారి లేదు.

దంపతులు బిడ్డల మృతదేహాలతో కాలి నడకన నడుస్తున్న వీడియోను మహారాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్‌ నేత విజయ్ వాడెట్టివార్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో ప్రజల దుస్థితి ఏ విధంగా ఉందో వివరించారు. సంఘటన జరిగిన ప్రాంతానికి ధర్మారావు బాబా అత్రమ్ ఎఫ్‌డీఏ మంత్రిగాను, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ గడ్చిరోలి జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా ఉన్నట్లు తన పోస్టులో తెలిపారు. ఇక సెప్టెంబరు 1న గర్భిణీ గిరిజన మహిళ ఇంటి వద్ద చనిపోయిన బిడ్డను ప్రసవించిందని, ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్‌ లేకపోవడంతో ఆమె మరణించిందని విజయ్ వాడెట్టివార్‌ గుర్తు చేశారు. షిండే పాలనలో మరణాల సంఖ్య ఎందుకు పెరుగుతుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు కావాలా? అంటూ ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.