ఆ ఎంపీకి నో ఎంట్రీ.. కులం “రొచ్చు”లో ఓ గ్రామం

కులం ఇప్పటికీ మనుషుల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. చంద్రయాన్ కాలంలో కూడా వర్ణ, వర్గ విభేదాలతో అగాధాలు మానవ సంబంధాలను మంటగలుపుతూనే ఉన్నాయి. కులం రేపిన కుంపట్లకు బలవుతున్నవారి జాబితాలో సామాన్యులే కాదు వివిధ పార్టీల నేతలు కూడా అతీతులు కాదు. తాజాగా కర్ణాటక అధికార పార్టీ బీజేపీకి చెందిన సీనియర్ నేత, చిత్రదుర్గ లోక్‌సభ సభ్యుడు ఎ.నారాయణస్వామిని దళితుడు అంటూ ఓ గ్రామంలోకి రానివ్వలేదు. వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం పవడగ లోని గొల్లరహట్టి […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:00 pm, Tue, 17 September 19
ఆ ఎంపీకి నో ఎంట్రీ.. కులం "రొచ్చు"లో ఓ గ్రామం

కులం ఇప్పటికీ మనుషుల మధ్య చిచ్చు రేపుతూనే ఉంది. చంద్రయాన్ కాలంలో కూడా వర్ణ, వర్గ విభేదాలతో అగాధాలు మానవ సంబంధాలను మంటగలుపుతూనే ఉన్నాయి. కులం రేపిన కుంపట్లకు బలవుతున్నవారి జాబితాలో సామాన్యులే కాదు వివిధ పార్టీల నేతలు కూడా అతీతులు కాదు. తాజాగా కర్ణాటక అధికార పార్టీ బీజేపీకి చెందిన సీనియర్ నేత, చిత్రదుర్గ లోక్‌సభ సభ్యుడు ఎ.నారాయణస్వామిని దళితుడు అంటూ ఓ గ్రామంలోకి రానివ్వలేదు.

వివరాల్లోకి వెళితే సోమవారం సాయంత్రం పవడగ లోని గొల్లరహట్టి గ్రామంలో ఎంపీ నారాయణస్వామి పర్యటనకు వెళ్లారు. స్ధానికంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సీఎస్ఆర్) పథకం కింద ఇళ్లు లేని వారికి ఇల్లు కట్టించే విషయంలో ఆయన గ్రామస్తులతో చర్చించాలనుకున్నారు. ఆయన వెంట బయోకాన్ ఫార్మా కంపెనీ, నారాయణ హృదయాల ప్రతినిధులు కూడా వెళ్లారు. గొల్లరహట్టి గ్రామంలో యాదవుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ఎంపీ నారాయణస్వామి గ్రామంలోకి వచ్చిన వెంటనే స్ధానికులు వీరిని అడ్డుకున్నారు. స్ధానిక ఎంపీ అని చూడకుండా తమ గ్రామంలోకి దళితులకు ప్రవేశం లేదు అంటూ ఆయన మొహం మీదనే.. అందరి ఎదురుగా తెగేసి చెప్పేశారు. అయితే గొల్లరహట్టి గ్రామాభివృద్ధికోసం మాట్లాడేందుకు వచ్చామని ఎంపీతో సహా వచ్చిన ప్రతినిధులు చెప్పినా వారు వినలేదు. పైగా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఎంపీ తమ గ్రామం వెలుపలే కూర్చుని మాట్లాడాలంటూ నారాయణస్వామికి కుర్చీ వేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికి పరిస్థితి నెమ్మదించిన తర్వాత ఎంపీని గ్రామంలోకి రావాలంటూ చెప్పారు. దీంతో ఎంపీ గ్రామస్తుల మాటను సున్నితంగా తిరస్కరించి గ్రామంలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. ఆయన అక్కడినుంచి వెళ్లిపోగానే వారిలో వారే తగాదాకు దిగారు.

మనసుల్లో మార్పు అవసరం..

తనకు జరిగిన అవమానంపై ఎంపీ నారాయణస్వామి స్పందిస్తూ గ్రామస్తులపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. సమాజంలో ఇప్పటికీ అంటరానితనం కొనసాగుతుండటంపై విచారం వ్యక్తం చేశారు. గ్రామస్తుల  ఆలోచనా విధానంలో మార్పు రావాలని, గొల్లరహట్టి గ్రాస్తులపై ఎటువంటి  కేసు పెట్టే ఆలోచన తనకు లేదన్నారు. . చట్టాలతో మనసులను మార్చలేమని చట్టాలు ఎన్ని చేసినా ముందు మనసుల్లో మార్పు తీసుకురావలంటూ ఎంపీ నారాయణస్వామి వ్యాఖ్యానించారు.