Vikram Misri: కాల్పుల విమరణలో ఎవరి పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
భారత్-పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్ర లేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పినట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ద్వైపాక్షిక స్థాయిలో జరిగిందని.. ఇందులో ట్రంప్ ప్రమేయం ఏమి లేదని ఆయన పార్లమెంట్ కమిటీకి కొన్ని చెప్పినట్టు కొన్ని జాతీయ మీడియాల నివేదికలు పేర్కొన్నాయి.

భారతదేశం-పాకిస్తాన్ కాల్పుల విరమణలో ఏడుసార్లు మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ బహిరంగంగా ప్రకటించుకున్నారని.. ఈ విషయంపై భారతదేశం ఎందుకు మౌనంగా ఉందని ప్యానెల్ సభ్యులు ప్రశ్నించారు. అయితే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ వాదనలను తోసిపుచ్చారు, కాల్పుల విరమణ భారతదేశం-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక నిర్ణయమేనని.. ఇందులో అమెరికాతో సహా మరే ఇతర దేశం ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేసినట్టు పార్లమెంట్ వర్గాలు తెలిపారు. భారత్-పాక్ మధ్య చర్చలకు అమెరికాను ఎవరూ పిలవలేదని.. ట్రంప్ తనంతట తాను వచ్చారని అని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.
భారతదేశం-పాకిస్తాన్ మధ్య వివాదం సాంప్రదాయ యుద్ధ పరిధిలోనే ఉందని.. పాకిస్తాన్ నుండి ఎటువంటి అణ్వాయుధ సంకేతాలు లేవని విదేశాంగ కార్యదర్శి మిస్రి స్పష్టం చేశారు. రెండు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOలు) మే 10న అన్ని సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనకు వచ్చాయని ఆయన తెలిపారు. పాకిస్తాన్ చైనాకు సంబంధించిన సైనిక హార్డ్‌వేర్‌ను ఉపయోగించడంపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశాడు. అయితే దీనిపై స్పందించిన మిస్రీ వారు ఏమి ఉపయోగించినా పర్వాలేదు.. మేము వారి వైమానిక స్థావరాలను తీవ్రంగా దెబ్బతీశాము అని సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటనపై ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి మాటలను ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దని మిస్రీ సభ్యులను కోరారు. ఆపరేషన్ సిందూర్ మొదటి దశ తర్వాత పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద లక్ష్యాలను మాత్రమే ధ్వంసం చేసినట్లు న్యూఢిల్లీ ఇస్లామాబాద్‌కు తెలియజేసిందని జైశంకర్ చెప్పారని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




