Vice President: ఉపరాష్ట్రపతికి ఎలాంటి అధికారాలుంటాయి.. రాష్ట్రపతి బాధ్యతలను ఎప్పుడు స్వీకరిస్తారు?
Vice President: ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. అదే రోజే ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం..
Vice President: ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. అదే రోజే ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. అంటే పదవీకాలం పూర్తయ్యే 4 రోజుల ముందు కొత్త ఉపరాష్ట్రపతిని ప్రకటిస్తారు. రాష్ట్రపతి పదవికి అభ్యర్థులను ప్రకటించగా, ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థుల పేర్లు రావాల్సి ఉంది. అటువంటి పరిస్థితిలో ఉపరాష్ట్రపతి పని ఏమిటి?, అతని బాధ్యతలు ఏమిటి? ఉప రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏమిటో తెలుసుకుందాం.
ఉపరాష్ట్రపతి పదవి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి. దేశంలో ఏదైనా కారణం వల్ల రాష్ట్రపతి గైర్హాజరైనప్పుడు, ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఏ కారణం చేతనైనా తన బాధ్యతను నిర్వహించలేనప్పుడు రాష్ట్రపతి బాధ్యతను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. రాష్ట్రపతి తన పదవిని చేపట్టే వరకు ఉప రాష్ట్రపతి చూస్తారు. భారత రాజ్యాంగంలోని 66వ అధికారణ ప్రకారం.. పార్లమెంట్ సభ్యులు బ్యాలెట్ విధానం ద్వారా ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు.
భారత ఉపరాష్ట్రపతి అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రాష్ట్రపతి రాజీనామా చేసినా, బహిష్కరించబడినా లేదా మరణిస్తే, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలను స్వీకరిస్తారు. అయితే ఇది 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉండదు. అటువంటి పరిస్థితిలో 6 నెలల్లో రాష్ట్రపతి ఎన్నిక అనేది తప్పనిసరి.
ఉప రాష్ట్రపతిగా పదవి చేపట్టిన వారు రాజ్యసభ చైర్మన్‌గాను వ్యవహరిస్తారు. ఏదైనా కారణంతో రాష్ట్రపతి పదవి ఖాళీ అయినా, లేదా రాష్ట్రపతి విధులకు హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నా.. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వర్తిస్తారు. ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. ఉప రాష్ట్రపతి హోదాలో ఉన్నవారు ఈ పదవిని నిర్వర్తించేందుకు ఎలాంటి వేతనం పొందరు.
ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా పనిచేస్తారు. రాజ్యసభ కార్యకలాపాల్లో ఛైర్మన్ కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహరణకు.. రాజ్యసభలో బిల్లుకు 50% – 50% ఓట్లు ఉన్నాయని అనుకుందాం.. అటువంటి పరిస్థితిలో కాస్టింగ్ ఓటు వేసే హక్కు రాజ్యసభ ఛైర్మన్‌కు ఇవ్వబడింది. ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలనుకుంటే రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. రాజ్యసభలో అప్పటి మెజారిటీ సభ్యులు ఆమోదించిన రాజ్యసభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి